
ఏఐ సాయంతో షటిల్ పథాన్ని కనిపెట్టి కొడుతున్న రోబో
కొందరు బ్యాట్మింటన్ ఆడుతుంటే దూరంగా పడిన షటిల్‌ను వాళ్ల పెంపుడు శునకం పరుగెత్తుకెళ్లి నోటితో కరిచి తెచ్చివ్వడం చూస్తూనే ఉంటా. అయితే ఈ రోబో శునకం మాత్రం షటిల్‌ను తెచ్చివ్వడానికి బదులు షటిల్‌బ్యాట్ పట్టుకుని ఆటకు సిద్ధమైంది. రోబోటిక్స్, కృత్రిమ మేథ, క్రీడాంశాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త తరహా రోబో ఇప్పుడు రోబోటిక్ రంగంలో చర్చనీయాంశమైంది.
బ్యాడ్మింటన్‌లో చకాచకా షటిల్‌తో షాట్స్ కొడుతుంటే టకాటకా తిరిగి షాట్స్ కొడుతున్న చిన్న రోబో శునకానికి ‘ఏఎన్‌వైఎంఏఎ–ఎనిమల్’అని పేరు పెట్టారు. స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయం అయిన ఈటీహెచ్, జ్యూరిచ్‌లోని పరిశోధకులు ఈ రోబో శునకాన్ని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్‌ల మేలు కలయికగా దీనిని తయారుచేశామని పరిశోధకులు చెప్పారు. మనిషి తరహాలో వేగంగా కదులుతూ షటిల్ గమనాన్ని గుర్తిస్తూ తిరిగి షాట్ కొట్టగలడం ఈ రోబో శునకం ప్రత్యేకత. వర్సిటీలోని రోబోటిక్స్ సిస్టమ్స్ ల్యాబ్‌లోని ప్రొఫెసర్ మార్కో హట్టర్ సారథ్యంలోని పరిశోధనా బృందం ఈ రోబోను సృష్టించింది.
ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ రోబో శునకం బరువు 50 కేజీలుకాగా ఎత్తు 1.5 అడుగులు మాత్రమే. ఎదురుగా షటిల్‌కాక్ దూసుకొచ్చే విధానాన్ని విశ్లేషించి, దానికి అనుగుణంగా కాళ్లు కదపాల్సిన విధానాన్ని విశ్లేషించి ఈ రోబోకు ప్రోగ్రామింగ్ చేశారు. ఎదురుగా నిలబడిన ఆటగాడు ఎంత ఎత్తు నుంచి షటిల్‌కాక్ కొట్టాడు? కాక్ ఎంత ఎత్తు నుంచి దూసుకొస్తోంది? ఎంత వేగంతో వస్తోంది? అది ఏ దిశలో నేలను తాకొచ్చు? అనే పలు అంశాలపై తొలుత పరిశీలనచేసి ఓ అంచనాకొచ్చారు. తర్వాత కాక్ పథానికి తగ్గట్లు ఎనిమల్ రోబో శునకం నాలుగు కాళ్లను ఎటు వైపునకు కదపాలి.
పరుగెత్తేలా లేదంటే ఇంకా పైకి లేచి కొడితే సరిపోతుందా? ఒకవేళ పరిగెడితే వెంటనే పడిపోకుండా స్థిరంగా నిలదొక్కుకోవడం ఎలా? అనే అనేక అంశాలపై ముందస్తు అంచనాప్రోగ్రామ్‌లను రాసుకొని వాటితో తొలుత పరీక్షలు జరిపి విజయవంతమయ్యారు. తర్వాత అన్నింటినీ కలిపి ఆటగాడు కొట్టిన కాక్‌ను వేగంగా తిరిగికొట్టడం, అది కూడా కోర్ట్‌కి లోపల పడేలా షాట్ కొట్టడం వంటివి ప్రోగ్రామింగ్‌కు జతచేశారు. ఆట వేగానికి తగ్గట్లుగా రోబో శునకం నాలుగు కాళ్లు మాత్రమే కాదు ప్రత్యేక ‘చేయి’సైతం చురుకుగా కదిలేలా పలు మార్పులుచేశారు. ఎట్టకేలకు మనిషి ఆటను సైతం ఎదిరించేలా స్థాయికి రోబోను సృష్టించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్