భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.
ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.
298 పరుగులు
ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్ (122) సెంచరీ చేయగా.. షేక్ రషీద్ 31, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23, హేమంత్ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
శతక్కొట్టిన విరాట్ కోహ్లి
ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జీత్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్పిత్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.
మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 131 పరుగులు చేశాడు. రాజు బౌలింగ్‌లో షేక్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
చదవండి: తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర


