జార్ఖండ్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. విధ్వంసకర శతకాలతో విరుచుకుపడి.. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
అంతేకాదు.. జార్ఖండ్‌కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఈ క్రమంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 టోర్నీలోనూ సారథిగా జార్ఖండ్‌ను ముందుకు నడిపిస్తున్నాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan). ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎ లో ఉన్న జార్ఖండ్ కర్ణాటకతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
మెరుపు అర్ధ శతకాలు
అహ్మదాబాద్ వేదికగా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 412 పరుగులు సాధించింది. ఓపెనర్లలో శిఖర్ మోహన్ (44) ఫర్వాలేదనిపించగా.. ఉత్కర్ష్ సింగ్ (8) విఫలమయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ శుభ్ శర్మ 15 పరుగులే చేయగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన విరాట్ సింగ్ (68 బంతుల్లో 88), కుమార్ కుశాగ్రా (47 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకాలతో దుమ్ములేపారు.
ఆకాశమే హద్దుగా
ఇక ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 33 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. తద్వారా లిస్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్ చరిత్రకెక్కాడు.
నిజానికి విజయ్ హజారే తాజా సీజన్ ఆరంభానికి ముందు లిస్ట్-ఎ క్రికెట్ ఫాస్టెస్ట్ సెంచూరియన్‌గా పంజాబీ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ (35 బంతుల్లో 115*) ఉన్నాడు. అయితే, బుధవారం నాటి మరో మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ మీద బిహార్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం బాది అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు.
వైభవ్ రికార్డు బద్దలు
కానీ కాసేపటికే వైభవ్‌ను అధిగమించి.. ఇషాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు.. బిహార్ కెప్టెన్ సకీబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేసి.. అన్మోల్‌ప్రీత్ సింగ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరగా.. ఇషాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. కర్ణాటకతో మ్యాచ్‌లో ఇషాన్ మొత్తంగా 39 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్స్‌లు బాది 125 పరుగులు సాధించాడు.
మిగతా వారిలో అనుకూల్ రాయ్ (13), రాబిన్ మింజ్ (0) విఫలం కాగా.. సుశాంత్ మిశ్రా (1), సౌరభ్ శేఖర్ (0) అజేయంగా నిలిచారు. కర్ణాటక బౌలర్లలో అభిలాష్ శెట్టి నాలుగు వికెట్లు తీయగా.. విద్యాధర్ పాటిల్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు.. ధ్రువ్ ప్రభాకర్ ఒక వికెట్ పడగొట్టారు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన భారత ఆటగాళ్లు
👉సకీబుల్ గని- 32 బంతుల్లో
👉ఇషాన్ కిషన్- 33 బంతుల్లో
👉అన్మోల్‌ప్రీత్ సింగ్- 35 బంతుల్లో
👉వైభవ్ సూర్యవంశీ- 36 బంతుల్లో.
చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు


