విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రారంభమైన తొలి రోజే సెంచరీల మోత మోగుతుంది. తొలుత యువ చిచ్చరపిడుగు, ఆతర్వాత పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్.. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకాలు బాదారు.
సిక్కింతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ కేవలం 61 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 91 బంతుల్లో 150 పరుగుల మార్కును కూడా దాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ 17 ఏళ్ల తర్వాత సాధించిన శతకం ఇది.
సిక్కిం నిర్దేశించిన 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ ఈ సూపర్ ప్రదర్శన చేశాడు. టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాపై కూడా పరుగుల వరద పారించాడు. ఆసీస్‌పై సెంచరీ, హాఫ్ సెంచరీ.. ఆతర్వాత సౌతాఫ్రికాపై రెండు హాఫ్ సెంచరీలు చేసి, 38 ఏళ్ల లేటు వయసులోనూ శభాష్ అనిపించుకున్నాడు.
సిక్కింతో మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ శతక్కొట్టుడుతో ముంబై విజయానికి చేరువగా ఉంది. 29.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 226 పరుగులు చేసి, లక్ష్యానికి 11 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ 93 బంతుల్లో 18 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. అతనికి జతగా ముషీర్ ఖాన్ (25) ఉన్నాడు.


