టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సిక్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.
గాయం మూలంగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
వేగంగా కోలుకుంటున్నాడు!
ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!
దీంతో, శ్రేయస్ అయ్యర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి.
ఇందుకోసం అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.
అభిమానుల్లో సందేహాలు
ఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్ రాణా బంతితో రంగంలోకి దిగాడు.
అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడాఫ్/ఎక్స్‌ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ అందుకున్నాడు.
Shreyas SUPERMAN Iyer! 💪
Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025
ఐసీయూలో ఉంచి చికిత్స
ఈ క్రమంలో శ్రేయస్ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్‌ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.
కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఆసీస్ టూర్ సందర్భంగా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ.
కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.


