2024 వరల్డ్‌కప్ ట్రోఫీతో సామ్ కొన్‌స్టాస్, పీక్ (PC: ICC)
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్-2026 ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్ పీక్ సారథ్యం వహించనున్నాడు.
ఇక వరల్డ్‌కప్ ఆడే ఆసీస్ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.
పాల్గొనే జట్లు ఇవే
కాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్-19 మెన్స్ వరల్డ్‌కప్ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్-బి నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా పోటీపడతాయి.
కెప్టెన్ ఎవరంటే?
ఇక గ్రూప్-సి నుంచి ఇంగ్లండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్-డి నుంచి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్ బ్యాటర్ ఒలీవర్ పీక్ సారథిగా వ్యవహరించబోతున్నాడు.
భారత్‌తో ఫైనల్లో సత్తా చాటి
సౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో ఒలీవర్ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేశాడు.
అండర్-19 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు
ఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.


