పొట్టి క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్ల విక్రయం గురువారం మొదలుకానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 నిమిషాలకు టికెట్లు లైవ్‌లోకి రానున్నాయి.
ఇందులో భాగంగా ఎంట్రీ లెవల్ టికెట్ ధరను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వంద రూపాయలుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి అధికారిక భాగస్వామి బుక్‌మైషోలో టికెట్ల విక్రయం జరుగనుంది.
కాగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీ-2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా పాకిస్తాన్- నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ టోర్నీకి తెరలేవనుంది. అదే రోజు ముంబైలోని వాంఖడే వేదికగా భారత్- అమెరికాతో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెడుతుంది.
భారత్‌లో వాంఖడేతో పాటు.. చెన్నైలోని చెపాక్ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం.. శ్రీలంకలోని ఎస్‌ఎస్‌సీ కొలంబో, ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికలుగా ఉన్నాయి.
ఈడెన్ గార్డెన్స్‌లో అతి తక్కువగా రూ. 100 నుంచే టికెట్ లభించనుండగా.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రూ. 150తో ధర మొదలుకానుంది. అహ్మదాబాద్‌లోనూ రూ. 100 టికెట్ అందుబాటులో ఉంది. చెపాక్‌లో అత్యధికంగా రూ. 2 వేల ధరతో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.


