నిలకడగా శ్రేయస్ ఆరోగ్యం
ఆస్ట్రేలియాలోనే చికిత్స
సిడ్నీ: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా తేలింది. ఆ్రస్టేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడికి ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అతడి పక్కటెముకల లోపలి భాగంలో రక్త స్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. వైద్య పరిభాషలో ‘స్పీన్ లేసరేషన్’గా వ్యవహరించే ఈ ప్రమాదంతో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది. దాంతో వెంటనే శ్రేయస్‌ను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స నిర్వహించారు.
అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రేయస్ చికిత్సను పర్యవేక్షిస్తూ స్థానిక వైద్యులకు సహకరించేందుకు భారత టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌ను సిడ్నీలోనే ఉంచినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఎప్పటికప్పుడు శ్రేయస్ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. కనీసం వారం రోజుల పాటు అతను సిడ్నీలోనే ఉండే అవకాశం ఉంది. తమ కొడుకు వద్దకు వెళ్లేందుకు శ్రేయస్ తల్లిదండ్రులు అత్యవసర వీసా కోసం ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా... శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం.


