 
													చెన్నై: చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్‌వన్ సహజ యామలపల్లి, భారత రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 340వ ర్యాంకర్ సహజ 2–6, 2–6తో ప్రపంచ 78వ ర్యాంకర్, మూడో సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో... ప్రపంచ 341వ ర్యాంకర్ రష్మిక 5–7, 6–7 (2/7)తో ప్రపంచ 117వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
వెకిచ్‌తో 78 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తన తొలి సర్వీస్‌లో 25 పాయింట్లకుగాను 13 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 31 పాయింట్లకుగాను 15 పాయింట్లు స్కోరు చేసింది. కింబర్లీతో జరిగిన మ్యాచ్‌లో రష్మిక అద్భుతంగా ఆడినా విజయాన్ని అందుకోలేకపోయింది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక 12 ఏస్‌లు సంధించి, 7 డబుల్ ఫాల్ట్‌లు చేసింది.
తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తన తొలి సర్వీస్‌లో 56 పాయింట్లకుగాను 34 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 56 పాయింట్లకుగాను 19 పాయింట్లు సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సహజ, రష్మికలకు 4,470 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్ల చొప్పున లభించాయి. డబుల్స్ విభాగం తొలి రౌండ్‌లో సహజ (భారత్)–కరోలైన్ వెర్నర్ (జర్మనీ) ద్వయం 6–3, 3–6, 7–10తో పొలీనా–మరియా (ఉజ్బెకిస్తాన్) జంట చేతిలో ఓడిపోయింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
