చెన్నై ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన భారత స్టార్స్
చెన్నై: భారత్‌లో జరుగుతున్న మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–250 లెవెల్ ఏకైక టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి... భారత రెండో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో చోటు పొందిన వైష్ణవి అడ్కర్... ‘వైల్డ్ కార్డు’తో ఆడిన రైజింగ్ స్టార్ మాయా రాజేశ్వరన్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.
ప్రపంచ 658వ ర్యాంకర్ మాయా రాజేశ్వరన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 346వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–4తో గెలిచింది. 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రష్మిక తన తొలి సర్వీస్‌లో 32 పాయింట్లకుగాను 26 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 20 పాయింట్లకుగాను 6 పాయింట్లు స్కోరు చేసింది.
ప్రపంచ 207వ ర్యాంకర్ ప్రిస్కా నుగ్రోహో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 344వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో విజయం సాధించింది. 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ‘బర్త్‌డే గర్ల్’ సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్‌లో 37 పాయింట్లకుగాను 22 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 27 పాయింట్లకుగాను 14 పాయింట్లు స్కోరు చేసింది.
మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో వైష్ణవి 1–6, 2–6తో ప్రపంచ 78వ ర్యాంకర్, మూడో సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో డొనా వెకిచ్‌తో సహజ; ప్రపంచ 117వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా)తో రష్మిక తలపడతారు.
రియా–రుతుజా జోడీ సంచలనం
మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్‌లో రియా భాటియా–రుతుజా భోస్లే జోడీ 6–2, 6–2తో మూడో సీడ్ దలీలా జకుపోవిచ్–నికా రాడిసికి (స్లొవేనియా) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ ప్రత్యర్థుల సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
మరో మ్యాచ్‌లో మాయా రాజేశ్వరన్–వైష్ణవి అడ్కర్ (భారత్) జంట 6–2, 1–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో అమీనా అన్‡్షబా–ఈడెన్ సిల్వా (బ్రిటన్) జోడీపై గెలిచి ముందంజ వేసింది. అయితే అంకిత రైనా–శ్రీవల్లి రష్మిక (భారత్) జోడీకి మాత్రం తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. అంకిత–రష్మిక జంట 6–7 (2/7), 2–6తో మాయి హొంటామా–అకీకో ఒమాయి (జపాన్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.


