రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్. ఈ మూవీలో రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మూవీ నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాహుల్ రవీంద్రన్ తనతో ఓ మాట అన్నారని తెలిపారు. ఈ మూవీ సూపర్ హిట్ అయితే నెక్ట్స్ మూవీకి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుని ఓ ఇల్లు కొనుక్కుంటానని నాతో చెప్పారని అన్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు హైదరాబాద్‌లో ఇప్పటివరకు సొంతిల్లు లేదన్నారు. ఈ సినిమా హిట్ అయితే నేనే మీ ఇంటి కలను నెరవేరుస్తానని నిర్మాత ధీరజ్ మొగిలినేని హామీ ఇచ్చారు.
కాగా.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


