వరుస విజయాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన నటించిన ద్విభాషా చిత్రం కుబేర మంచి విజయంతోపాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కోడై చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇటీవల ఆయన నటించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే చిత్రం సక్సెస్ అయ్యింది. తాజాగా ధనుష్ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం.
తమిళ హిట్ మూవీ 'పోర్ తొళిల్'తో గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై డి.ఐసరిగణేష్ నిర్మిస్తున్నారు. మమితాబైజూ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్, జయరాం, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నై, రామనాథపురం, దిండిక్కల్, పరమకుడి ప్రాంతాల్లో పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుష్, మమితాబైజూ చిత్ర యూనిట్ శనివారం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.


