ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ రష్మిక మందన్నా. ఇప్పటికే ఛావాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా రష్మిక తాజాగా టాలీవుడ్ టాక్ షోకు హాజరైంది. నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము..నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేసింది. ఈ షోలో పాల్గొన్న రష్మిక చేతికి రెండు ఉంగరాలు కనిపించడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ఈ సందర్భంగా రష్మికను జగపతిబాబు సరదాగా ఆటపట్టించారు. దళపతి విజయ్, విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతో ఫ్రెండ్‌షిప్, విజయ్ సేతుపతి ఫ్యాన్, దళపతి విజయ్‌కి ఆల్ టైమ్ ఫ్యాన్ ఇలా విజయాన్ని సొంతం చేసేసుకున్నావా? అంటూ ఫన్నీగా మాట్లాడారు.
ఆ తర్వాత చేతికి ఉన్న రింగ్స్‌ను సెంటిమెంట్‌తోనే పెట్టుకున్నావా అని జగపతిబాబు అడిగారు. దీనికి రష్మిక మాట్లాడుతూ.. అవీ చాలా ఇంపార్టెంట్ అని ముద్దుగుమ్మ చెప్పేసింది. వాటిలో ఒక రింగ్ ఫేవరేట్ అయి ఉంటుంది.. దానికి ఓ హిస్టరీ కూడా ఉంటుందని జగపతి నవ్వుతూ అన్నారు. దీనిపై ఆడియన్స్ ఏదో గోల చేస్తున్నారు.. అదేంటో కనుక్కోండని రష్మికతో చెప్పగా.. అది తాను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.
అయితే గతనెలలో రష్మిక- విజయ్ దేవరకొండకు ఎంగేజ్‌మెంట్ జరిగిందని వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో టాలీవుడ్ ప్రియులతో పాటు అభిమానుల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇటీవల తరచుగా రష్మిక చేతికి ప్రత్యేక రింగ్ కనిపించడంతో నిశ్చితార్థం జరిగినట్లు ఫ్యాన్స్ ఫుల్‌గా ఫిక్సయిపోయారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
