తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌పై ఎటువంటి బజ్ లేనప్పుడు షోకి ప్రాణం పోసింది సంజన గల్రానీ. గప్‌చుప్‌గా గుడ్డు దొంగతనం చేసి అందదరూ గొడవపడేలా చేసింది. ఒక్కక్కరి నిజస్వరూపాలు బయటపడేలా చేసింది. తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఫినాలేలో అడుగుపెట్టింది. అన్నింటికీ ధైర్యంగా నిలబడే సంజనా.. గార్డెన్ ఏరియాలో కొడుకు ఫోటోను చూడగానే ఏడ్చేసింది.
కన్నీళ్లు పెట్టుకున్న సంజనా
అరగంటలో వస్తానని అబద్ధం చెప్పి బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు ఉన్నానని సారీ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు మరో జీవితాన్నిచ్చిన బిగ్‌బాస్‌ను గాడ్ ఫాదర్‌గా అభివర్ణించింది. తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. టాప్ గేర్‌లో ఆట మొదలుపెట్టి టాప్ 5 వరకు చేరిన మీ ప్రయాణంలో మీలో ఉన్నంత డ్రామా ఉంది. దాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
మీ ధైర్యమే..
సీజన్ 9 మొదటి కెప్టెన్‌గా నిలిచి ఆరంభం నుంచి ఆటను మీ చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి వారం నుంచి 15వ వారం వరకు ఇంట్లో ఏది జరిగినా అది మీ వల్ల జరగాలి లేదా మీకోసం జరగాలి అనేలా ఆడారు. గుడ్డుతో మొదలైన మీ అల్లరి మీ కొడుకు(ఇమ్మాన్యుయేల్)తో కలిసి ఎన్నో రెట్లు పెరిగింది. ఇంట్లో అందరికీ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. మీ ప్రతి ఎమోషన్ ఎలాంటి పరదా లేకుండా ప్రేక్షకులకు చూపాలన్న మీ నిర్ణయం, ధైర్యం వారిని మీకు మరింత చేరువ చేసింది.
ఎవరికీ అర్థం కాని గేమర్
అందరిలో ఒకరిగా ఉంటే ప్రత్యేకత ఏముంది? ఎవరి గుర్తింపు వారి చేతుల్లోనే ఉందని బలంగా నమ్మారు. టాస్కులో పోటీపడ్డా, సంచాలక్‌గా ఉన్నా, వంటగదిలో ఉన్నా, బెడ్ రూమ్‌లో కబుర్లు చెప్తున్నా.. సంజనా ఎక్కడుంటే అక్కడేదో జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు. సంజనా సైలైన్సర్‌గా, సంజూ బాబాగా, మమ్మీగా ఎవరికీ అర్థం కాని గేమర్‌గా వివిధ పాత్రల్లో ప్రతి నిమిషం వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించారు.
మొండిధైర్యం మీ సొంతం
ఆటలో మిగతావారు మీకన్నా బలంగా ఉన్నా, వారికి మిగతావారి మద్దతు ఉన్నా మీరెప్పుడూ అధైర్యపడలేదు. ఎవరి మీద ఆధారపడి ఆడటానికి ఈ ఇంట్లోకి రాలేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్నిక్కడి వరకు తీసుకొచ్చింది. ఒకసారి మీరు ఒక మాటపై నిలబడితే అవతలివైపు ఎవరున్నా వెనక్కు తగ్గని మొండిధైర్యం మీ సొంతం.
అదే మీ కన్నీళ్లకు కారణం
మీ దూకుడు మనస్తత్వం, మీ కత్తుల్లాంటి మాటలే మిమ్మల్ని చిక్కుల్లో పడేశాయి. అప్పుడు మీ మనసుకు దగ్గరైనవారితో అభిప్రాయభేదాలు వచ్చాయి. అది మీ మనసును ఎంతో బాధపెట్టింది. మీ కన్నీటికి కారణమైంది. కష్టాలెన్నో ఓర్చుకుని ఈ ఇంట్లో మీరు సాగించిన ప్రయాణాన్ని ఏదో ఒకరోజు మీ బాబు, ఐదు నెలల పాప చూసి ఎంతో గర్వపడతారు అని పొగిడాడు. తర్వాత జర్నీ వీడియో చూపించగా సంజనా ఉప్పొంగిపోయింది. అందులో తన అల్లరి, ప్రాంక్స్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లిరావడం.. గొడవలు.. ఇలా అన్నీ చూపించారు.


