హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (TSFDC), తెలంగాణ ప్రభుత్వ సంస్కృతి, యువజన, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల అంతర్జాతీయ ఉత్సవం నిర్వహించబడుతోంది.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. గౌరవ అతిథిగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వేడుక హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా తెలంగాణతో పాటు భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
యూరప్, అమెరికా వంటి దేశాలతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 700కు పైగా లఘు చిత్రాలు ఈ ఫెస్టివల్‌కు వచ్చాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి TSFDC చైర్మన్ దిల్ రాజు అధ్యక్షత వహించారు. I&PR స్పెషల్ కమిషనర్ ప్రియాంక, ప్రముఖ చిత్రనిర్మాతలు, విమర్శకులు, స్క్రీన్ రైటర్లు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలి రావు, నగేష్ కుకునూర్, లిమా దాస్ కూడా హాజరయ్యారు.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించిన జహాన్ అనే లఘుచిత్రం హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డ్ రేసులో ఉంది. ఈ మూవీ ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు.


