breaking news
Chennai Open ATP tournament
-
సహజ, రష్మిక నిష్క్రమణ
చెన్నై: చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. భారత నంబర్‌వన్ సహజ యామలపల్లి, భారత రెండో ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 340వ ర్యాంకర్ సహజ 2–6, 2–6తో ప్రపంచ 78వ ర్యాంకర్, మూడో సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో... ప్రపంచ 341వ ర్యాంకర్ రష్మిక 5–7, 6–7 (2/7)తో ప్రపంచ 117వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓటమి పాలయ్యారు. వెకిచ్‌తో 78 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తన తొలి సర్వీస్‌లో 25 పాయింట్లకుగాను 13 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 31 పాయింట్లకుగాను 15 పాయింట్లు స్కోరు చేసింది. కింబర్లీతో జరిగిన మ్యాచ్‌లో రష్మిక అద్భుతంగా ఆడినా విజయాన్ని అందుకోలేకపోయింది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక 12 ఏస్‌లు సంధించి, 7 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తన తొలి సర్వీస్‌లో 56 పాయింట్లకుగాను 34 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 56 పాయింట్లకుగాను 19 పాయింట్లు సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సహజ, రష్మికలకు 4,470 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 30 ర్యాంకింగ్ పాయింట్ల చొప్పున లభించాయి. డబుల్స్ విభాగం తొలి రౌండ్లో సహజ (భారత్)–కరోలైన్ వెర్నర్ (జర్మనీ) ద్వయం 6–3, 3–6, 7–10తో పొలీనా–మరియా (ఉజ్బెకిస్తాన్) జంట చేతిలో ఓడిపోయింది. -
రష్మిక, సహజ శుభారంభం
చెన్నై: భారత్‌లో జరుగుతున్న మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ)–250 లెవెల్ ఏకైక టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో తొలి రోజు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి... భారత రెండో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో చోటు పొందిన వైష్ణవి అడ్కర్... ‘వైల్డ్ కార్డు’తో ఆడిన రైజింగ్ స్టార్ మాయా రాజేశ్వరన్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ప్రపంచ 658వ ర్యాంకర్ మాయా రాజేశ్వరన్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 346వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–4తో గెలిచింది. 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. రష్మిక తన తొలి సర్వీస్‌లో 32 పాయింట్లకుగాను 26 పాయింట్లు, రెండో సర్వీస్‌లో 20 పాయింట్లకుగాను 6 పాయింట్లు స్కోరు చేసింది. ప్రపంచ 207వ ర్యాంకర్ ప్రిస్కా నుగ్రోహో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 344వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో విజయం సాధించింది. 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ‘బర్త్‌డే గర్ల్’ సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. తొలి సర్వీస్‌లో 37 పాయింట్లకుగాను 22 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 27 పాయింట్లకుగాను 14 పాయింట్లు స్కోరు చేసింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో వైష్ణవి 1–6, 2–6తో ప్రపంచ 78వ ర్యాంకర్, మూడో సీడ్ డొనా వెకిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో డొనా వెకిచ్‌తో సహజ; ప్రపంచ 117వ ర్యాంకర్ కింబర్లీ బిరెల్ (ఆ్రస్టేలియా)తో రష్మిక తలపడతారు. రియా–రుతుజా జోడీ సంచలనం మహిళల డబుల్స్ విభాగంలోనూ భారత జోడీలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్లో రియా భాటియా–రుతుజా భోస్లే జోడీ 6–2, 6–2తో మూడో సీడ్ దలీలా జకుపోవిచ్–నికా రాడిసికి (స్లొవేనియా) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తమ ప్రత్యర్థుల సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో మాయా రాజేశ్వరన్–వైష్ణవి అడ్కర్ (భారత్) జంట 6–2, 1–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో అమీనా అన్‡్షబా–ఈడెన్ సిల్వా (బ్రిటన్) జోడీపై గెలిచి ముందంజ వేసింది. అయితే అంకిత రైనా–శ్రీవల్లి రష్మిక (భారత్) జోడీకి మాత్రం తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. అంకిత–రష్మిక జంట 6–7 (2/7), 2–6తో మాయి హొంటామా–అకీకో ఒమాయి (జపాన్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్‌గా సాకేత్ జోడీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని ఈ సీజన్లో చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో డబుల్స్ టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. భారత సహచరుడు రామ్‌కుమార్ రామనాథన్‌తో కలిసి బరిలోకి దిగిన సాకేత్ చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో సాకేత్ – రామ్‌కుమార్ జోడి 4–6, 4–6తో షింటారో మొచిజుకి–కైటో వుసుగి (జపాన్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. జపాన్ జోడీ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లపై పైచేయి సాధించింది. దీంతో తొలి సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత రెండో సెట్లోనూ భారత జంట పుంజుకోలేకపోయింది. ఇదే అదనుగా షింటారో–కైటోలు చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్‌తో పాటు టైటిల్‌ను గెలుచుకుంది. గతేడాది ఇక్కడ భారత ద్వయం టైటిల్ సాధించింది. ఈ సారీ టైటిల్ వేటలో నిలిచినా... చివరి మెట్టుపై చతికిలబడింది. సాకేత్–రామ్ కుమార్ జోడీ తదుపరి ఈ నెల 17 నుంచి పుణేలో జరిగే ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ బరిలోకి దిగుతుంది. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని(Saket Myneni) టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌తో జత కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సాకేత్–రామ్‌కుమార్ (భారత్) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్ సీడ్ రే హో (చైనీస్ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్ రోమియోస్ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను రెండేసి సార్లు కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో మాత్రం సాకేత్–రామ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్) జోడీతో సాకేత్–రామ్ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీపై గెలిచింది. -
రిత్విక్–నిక్కీ పునాచా జోడీ ముందంజ
చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రిత్విక్–నిక్కీ జంట 5–7, 6–1, 10–7తో పరీక్షిత్ సొమాని–మనీశ్ సురేశ్ కుమార్ (భారత్) ద్వయంపై విజయం సాధించింది. భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ కూడా సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 4–6, 6–4, 10–6తో డాన్ యాడెడ్–ఉగో బ్లాంచెట్ (ఫ్రాన్స్) జోడీపై గెలుపొందింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో తొషిహిదె మత్సుయ్–కైటో యుసుగి (జపాన్)లతో సాకేత్–రామ్‌కుమార్; జేకబ్–మార్క్ వాల్నెర్ (జర్మనీ)లతో రిత్విక్–నిక్కీ తలపడతారు. -
భారత టెన్నిస్ క్రీడాకారిణులకు నిరాశ
చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్‌లో బరిలోకి దిగిన ఐదుగురు ప్లేయర్లు సౌజన్య బవిశెట్టి, లక్ష్మీ ప్రభ, రియా భాటియా, రుతుజా భోస్లే, సాయి సంహిత తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. శనివారం చెన్నైలో జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య 4–6, 0–6తో క్యోకా ఒకమురా (జపాన్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో లక్ష్మీ ప్రభ 4–6, 1–6తో యుకీ నైటో (జపాన్) చేతిలో... సంహిత 1–6, 0–6తో నావో హిబినో (జపాన్) చేతిలో... రియా 4–6, 0–6తో మికుల్స్కైటీ (లిథువేనియా) చేతిలో... రుతుజా 3–6, 2–6తో ఎన్షువో లియాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు. భారత్‌కే చెందిన అంకిత రైనా, కర్మన్కౌర్లకు మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు వైల్డ్ కార్డు కేటాయించారు. చదవండి: US Open 2022: ‘నంబర్‌వన్’ సమరం -
సెమీస్‌కు పేస్ జోడి
* భూపతి-సాకేత్ జంటపై గెలుపు * చెన్నై ఓపెన్ చెన్నై: చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్, రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడి డబుల్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మహేశ్ భూపతి, సాకేత్ మైనేని జంటను 1-6, 6-1, 10-7 తేడాతో పేస్ జోడి ఓడించింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భూపతి, సాకేత్ జంట కీలక సమయాల్లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్‌ను ఈ జోడి తేలిగ్గా గెలుచుకున్నప్పటికీ రెండో సెట్లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో మ్యాచ్ నిర్ణాయక మూడో సెట్‌కు వెళ్లింది. ఇక్కడ హోరాహోరీ పోరు ఎదురైనా పేస్ తన అనుభవాన్ని జత చేసి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. సింగిల్స్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ రాబర్టో బటిస్టా అగట్ (స్పెయిన్) 6-3, 6-2తో పీటర్ గోజోసిక్ (జర్మనీ)పై, యెన్ సున్ లు 6-4, 6-4తో పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్)పై గెలిచారు. గిలెర్మో గార్షియా లోపెజ్ 6-7 (1), 6-2, 6-0తో ఇటో తట్సుమా (జపాన్)ను ఓడించి క్వార్టర్స్‌కు చేరారు.


