
అల్ అయిన్ (అబుదాబి): హైదరాబాద్ యువ షట్లర్ శ్రియాన్షి వలిశెట్టి అల్ అయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా అవతరించింది. అబుదాబిలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల శ్రియాన్షి టైటిల్‌ను సొంతం చేసుకుంది. పుల్లెల గోపీచంద్ అకాడమీకి చెందిన శ్రియాన్షి ఫైనల్లో భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌పై 15–21, 22–20, 21–7తో విజయం సాధించింది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ తుది పోరులో శ్రియాన్షి తొలి గేమ్‌లో తడబడింది. అయితే రెండో గేమ్‌లో తన తప్పిదాలను సరిదిద్దుకొని ప్రత్యరి్థపై పైచేయి సాధించింది.
నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం ప్రపంచ 61వ ర్యాంకర్ శ్రియాన్షి ధాటికి ప్రపంచ 59వ ర్యాంకర్ తస్నిమ్ తేలిపోయింది. 6–7తో వెనుకబడిన దశలో శ్రియాన్షి ఒక్కసారిగా చెలరేగిపోయి వరుసగా 15 పాయింట్లు సాధించి 21–7తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా తన కెరీర్‌లో తొలి వరల్డ్ టూర్–100 లెవెల్ టైటిల్‌ను గెల్చుకుంది. చాంపియన్ శ్రియాన్షికి 9,000 డాలర్ల (రూ. 7 లక్షల 99 వేలు) ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీలో పురుషుల డబుల్స్ టైటిల్‌ను హరిహరన్–అర్జున్ (భారత్) జోడీ గెలుచుకుంది. ఫైనల్లో హరిహరన్–అర్జున్ ద్వయం 21–17, 21–18తో రేమండ్ ఇంద్ర–నికోలస్ (ఇండోనేసియా)పై నెగ్గింది. హరిహరన్ –అర్జున్ జోడీకి 9,480 డాలర్ల (రూ. 8 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.