
తొలి రౌండ్‌లో సింధు విజయం
షెన్‌జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 21–5, 21–10తో ప్రపంచ 44వ ర్యాంకర్ జూలీ దవాల్ జేకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి గేమ్ ఆరంభంలో సింధు చెలరేగి వరుసగా 12 పాయింట్లు నెగ్గడం విశేషం.
ఈ గెలుపుతో ఈ సీజన్‌లో స్విస్ ఓపెన్ తొలి రౌండ్‌లో జూలీ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–5తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ ఆయుశ్ శెట్టికి నిరాశ ఎదురైంది.
తొలి రౌండ్‌లో ఆయుశ్ 19–21, 21–12, 16–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ చౌ టియెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 17–21, 11–21తో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్) జంట చేతిలో పరాజయం పాలైంది.
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో...
గతవారం హాంకాంగ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఆయుశ్ మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. నాలుగు స్థానాలు ఎగబాకిన ఆయుశ్ 27వ ర్యాంక్‌లో నిలిచాడు. హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన లక్ష్య సేన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని 17వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.