
శాన్‌ఫ్రాన్సిస్కోలోని విఖ్యాత గోల్డెన్ గేట్ బ్రిడ్జి వద్ద లేవర్ కప్‌తో టీమ్ యూరప్, టీమ్ వరల్డ్ ఆటగాళ్లు
నేటి నుంచి లేవర్ కప్ టోర్నీ
బరిలో అల్‌కరాజ్, జ్వెరెవ్ తదితరులు
శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా): ప్రపంచ పురుషుల టెన్నిస్‌లోని మేటి ఆటగాళ్లతో ప్రతి యేటా నిర్వహించే ‘లేవర్ కప్’ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మూడు రోజులపాటు ఈ టోర్నీ జరుగుతుంది. టీమ్ యూరప్, టీమ్ వరల్డ్ జట్ల మధ్య ఈ టోర్నీని నిర్వహిస్తారు. 2017లో మొదలైన ఈ టోర్నీ 2020లో కరోనా మహమ్మారి కారణంగా జరగలేదు. ఇప్పటి వరకు ఏడుసార్లు ఈ టోర్నీ జరగ్గా... ఐదుసార్లు టీమ్ యూరప్ (2017, 2018, 2019, 2021, 2024), రెండుసార్లు టీమ్ వరల్డ్ (2022, 2023) ‘లేవర్ కప్’ చాంపియన్‌గా నిలిచాయి.
ఈసారి టీమ్ యూరప్ తరఫున ప్రపంచ నంబర్‌వన్ కార్లోస్ అల్‌కరాజ్ (స్పెయిన్), మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), 11వ ర్యాంకర్ హోల్గర్ రూనె (డెన్మార్క్), 12వ ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే), 17వ ర్యాంకర్ జాకుబ్ మెన్‌సిఖ్ (చెక్ రిపబ్లిక్), 22వ ర్యాంకర్ టామస్ మఖచ్ (చెక్ రిపబ్లిక్), 25వ ర్యాంకర్ ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ) ఆడనున్నారు.
టీమ్ వరల్డ్ తరఫున ప్రపంచ 5వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), 8వ ర్యాంకర్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా), 21వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో సెరున్‌డోలో (అర్జెంటీనా), 32వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్ (అమెరికా), 42వ ర్యాంకర్ జోవా ఫోన్సెకా (బ్రెజిల్), 62వ ర్యాంకర్ రిలీ ఒపెల్కా (అమెరికా), 86వ ర్యాంకర్ జెన్సన్ బ్రూక్స్‌బై (అమెరికా) బరిలోకి దిగుతారు. టీమ్ యూరప్ జట్టుకు ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ యానిక్ నోవా (ఫ్రాన్స్)... టీమ్ వరల్డ్ జట్టుకు అమెరికా మేటి ప్లేయర్, ఎనిమిది గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ నెగ్గిన ఆండ్రీ అగస్సీ కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారు.