పనిగంటలు, సెలవులు, సంతోష సూచిక వంటి అంశాలతో గ్లోబల్ సర్వే
అగ్రస్థానంలో న్యూజిలాండ్.. 42వ స్థానంలో భారత్, 59వ ర్యాంకులో అమెరికా
గ్లోబల్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్–2025 నివేదికలో వెల్లడి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విధులు, పని–వ్యక్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించడం కీలకంగా మారింది. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు జీవన నాణ్యతను ఎంత వరకు సమతౌల్యంగా ఉండేలా చూస్తున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సంప్రదాయ ‘పని–జీవిత సమతౌల్యత’విధానాల మాదిరిగా కాకుండా ‘జీవితం–పని సమతుల్యత’సాధన అనే అంశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది.
మెరుగైన జీవనశైలితో జీవితానికి మొదటగా, పని లేదా విధులకు ఆ తర్వాత ప్రాధాన్యతనివ్వడం కొంతకాలంగా ఓ నూతన ధోరణిగా ప్రచారంలోకి వచి్చంది. సంతోషకరమైన జీవితం గడుపుతూ పనిపై ఆధిపత్యం చెలాయించకుండా చూడటాన్ని ప్రభావపూరితమైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌గా అంచనా వేస్తున్నారు. చాలా దేశాల్లో ఎక్కువ పని గంటలు, అసమతౌల్య ఆహారం గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
ఇదీ అధ్యయనం...
గ్లోబల్ హెచ్‌ఆర్ సంస్థ ‘రిమోట్’ఏటా ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఆధారిత 60 దేశాలను సర్వే చేస్తోంది. ఆయా దేశాల్లో చట్టబద్ధమైన చెల్లింపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, అనారోగ్య సెలవులు, ప్రసూతి సెలవులు, కనీస వేతనం, ఆరోగ్య సంరక్షణ, సంతోష సూచిక, వారంలో పని గంటలు, ప్రజాభద్రత, ‘ఎల్‌జీబీటీక్యూ ప్లస్’హక్కులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది.
ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడపడానికి, విధుల్లో పని చేయడానికి ఎలాంటి పరిస్థితులు వీలు కల్పిస్తాయో, ఏవి వెనుకబడి ఉన్నాయో అంచనా వేసి ర్యాంకులు ఇస్తోంది. అయితే బలమైన విధానాల కారణంగా ఉద్యోగుల శ్రేయస్సులో చిన్న ఆర్థిక వ్యవస్థలు తరచూ పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదికిగాను హెచ్‌ఆర్ సంస్థ విడుదల చేసిన నివేదికలో అమెరికా సహా అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు టాప్–10లో స్థానం లభించలేదు.
యూఎస్ ర్యాంక్ 60లో 59...
మొత్తం 60 దేశాల్లో గ్లోబల్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్–2025 పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్ 42వ ర్యాంకుతో అమెరికా కంటే చాలా ముందుంది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం 59వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆధునిక, డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో ప్రజలు పగలు, రాత్రి పని చేస్తారు. అయితే పని–జీవిత సమతౌల్యత అమెరికన్లకు ప్రధాన సమస్యగా మారింది.
ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఉద్యోగులు తక్కువ వేతనంతో కూడిన సెలవులు, తక్కువ కనీస వేతనం పొందుతున్నట్లు వెల్లడైంది. భారత్‌లో ఉద్యోగులు 35 రోజుల వేతనంతో కూడిన సెలవులను పొందుతున్నారు. పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పరిమిత అనారోగ్య సెలవులు, సుదీర్ఘ పనిగంటలు మాత్రం భారత ఉద్యోగులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.
న్యూజిలాండ్‌కు టాప్ ర్యాంక్...
ఈ నివేదికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు మంచి వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులను పొందుతున్నారు. దీంతో వారి ఉద్యోగ జీవితం ఉత్తమంగా ఉంది. వారికి 32 రోజుల వేతనంతో కూడిన సెలవు లభిస్తోంది. అనారోగ్య సెలవు తీసుకుంటే జీతంలో కోత విధింపు లేదు. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అక్కడి ఉద్యోగులకు గంటకు సగటు జీతం మెరుగ్గా చెల్లిస్తున్నారు.
నివేదికలోని టాప్–10 దేశాలివే...
ర్యాంకు దేశం
1 న్యూజిలాండ్
2 ఐర్లాండ్
3 బెల్జియం
4 జర్మనీ
5 నార్వే
6 డెన్మార్క్
7 కెనడా
8 ఆస్ట్రేలియా
9 స్పెయిన్
10 ఫిన్లాండ్


