ఈశాన్య రాష్ట్రం అస్సాంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల మందను ఢీ కొట్టడంతో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది ఏనుగులు మృతి చెందినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరికీ గాయాలు కూడా కాలేదు.
సైరాంగ్ నుంచి న్యూఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) అర్ధరాత్రి 2గం. సమయంలో హొజాయ్ జిల్లా పరిధిలో వెళ్తోంది. ఆ సమయంలో పట్టాలు దాటుతున్న ఏనుగుల మందను రైలు ఢీకొట్టింది. రైలు ఇంజిన్‌తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ఢీకొనడంతో 8 ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏనుగు గాయపడింది. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నార్త్‌ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
రైల్వే, అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఏనుగుల మందలు ఇలా పట్టాలు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటాయి. అయితే.. తాజాగా ఘటన జరిగిన హోజాయ్ జిల్లా ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు.


