సాక్షి, కాకినాడ: ప్రత్తిపాడులోని కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోరం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరూ డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు.
గురువారం వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్‌తో వెళ్తున్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది మరో కంటైనర్ లారీ. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు వాహనాల క్యాబిన్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇరువురు డ్రైవర్లు బయటకు దూకేయగా.. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనం అయ్యాడు.
సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అన్నవరం పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


