అర్ధరాత్రి వేళ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరోను, ఆ వెంటనే ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ఒకరు మృతి, 20 మందికి గాయాలు
కొనకనమిట్ల: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని, ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... శుక్రవారం రాత్రి కనిగిరి నుంచి వెదురుకర్రల లోడుతో గిద్దలూరుకు వెళ్తున్న బొలేరో వాహనం చినారికట్ల సమీపంలో మరమ్మతులకు గురైంది.
డ్రైవర్ పీరయ్య బొలేరోను రోడ్డు పక్కన నిలిపి వాహనం లోపల నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వాసవి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్‌ను కూడా ఢీకొంది.
దీంతో బొలేరో వాహనంలో ఉన్న వెదురు కర్రలు ట్రావెల్స్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకుపోయాయి. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు ముందు సీటులో కూర్చున్న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి (54) పొట్టలోకి వెదురు కర్ర చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు బస్సుల డ్రైవర్లతోపాటు మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను కొనకనమిట్ల పోలీసులు కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. జనార్ధన్‌రెడ్డి మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో వచి్చన భారీ శబ్దానికి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి ఏమైందో తెలియక చీకట్లో తీవ్ర భయాందోళనలకు గురై ఆర్తనాదాలు చేశారు.


