ఉత్తర భారతంపై పొగమంచు దుప్పటి కమ్మేసుకుంది. దేశ రాజధాని సహా పంజాబ్, హర్యానా, ఇటు ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్ సహా బిహార్ రాష్ట్రాలపై ప్రభావం చూపెడుతోంది. ఢిల్లీలో శనివారం తెల్లవారు ఝామున 8గం. సమయంలోనూ చిమ్మచీకట్లు నెలకొన్నాయి. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి కనిపించింది.
వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఊపిరి సైతం పీల్చుకోలేని స్థితిలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెడ్ అలర్ట్ నుంచి ఆరెంజ్ అలర్ట్‌కు మార్చింది వాతావరణ శాఖ. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు రోజంతా నెలకొంటాయని నగర వాసులను హెచ్చరిస్తోంది. మరోవైపు.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను కంటిన్యూ చేస్తోంది.
రాజధానిలో ఇవాళ ఉదయం 7గం. సమయంలో ప్రగతి మైదాన్ భైవర్ మార్గ్ వద్ద ఏక్యూఐ 433గా రికార్డు కావడం గమనార్హం. ఐటీవోలో 439, ఆనంద్ విహర్‌లో 423, జహంగీర్‌పూరీలో 420, నెహ్రూ నగర్‌లో 418, వాజిర్‌పూర్‌లో 417, పంజాబీ బాగ్‌లో 423, రోహిణిలో 407గా ఏఐక్యూ నమోదు అయ్యింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మొత్తంగా 380గా ఉండి ‘వెరీ పూర్’ కేటగిరీలో కొనసాగుతోంది.
#WATCH | Delhi | Dense layer of toxic fog engulfs the national capital. Visuals from Bhairav Marg near Pragati Maidan. CPCB claims that the AQI in the area is at '433', categorised as 'Severe'. pic.twitter.com/1D79ZqKSeG
— ANI (@ANI) December 20, 2025
పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో.. రహదారుల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాజధాని రీజియన్ నుంచి 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
మంచువల్ల ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేయొద్దని.. విమాన ప్రయాణాల అంతరాయాల విషయంలో తగిన మార్గదర్శకాలు పాటించాలని ఇటు పౌర విమానయాన శాఖ.. అటు డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశాయి.



