
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అంటనే మోసం అని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కబుర్లు చెప్పడం తప్ప.. అభివృద్ధి చేయడం చేతకాదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమని తెలిపారు.

ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ఎంపీలు గొల్ల బాబురావు, తనూజ రాణి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ సమన్వయ కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, స్టీల్ ప్లాంటు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది.
అనంతరం, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంది. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందని ప్రైవేటుపరం చేస్తున్నారు. చంద్రబాబు అంటేనే ఒక మోసం. చంద్రబాబు కబుర్లు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కూటమి పాలనలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ నెల తొమ్మిదో తేదీన వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తారు’ అని తెలిపారు.
రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు లేదా మూసివేత తప్పదు అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. ఎన్నికలు తరువాత మాట మార్చారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు. చంద్రబాబు నిజం చెప్పితే ఆయన తల పగిలిపోతుంది. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు ఈ సమీక్ష సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. 800 కోట్ల కేటాయించి కిడ్నీ హాస్పిటల్ కట్టించారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఒక మంచి పని అయినా చేశారా?. వైఎస్ జగన్ చేసిన పనులను తాము చేసినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మూలపేట పోర్టులో 90 శాతం పని వైఎస్ జగన్ హయంలో జరిగింది. చేసింది చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డము అని తెలిపారు.
బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. స్టీల్ ప్లాంట్ కోసం వైఎస్సార్‌సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. కూటమి ప్రభుత్వం 44 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే సంహరించుకోవాలి. ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయించాలి.. లేదా సెయిల్‌లో విలీనం చేయాలి. గ్రామాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.. కానీ ప్రజలకు ఏమీ చేయరు.

ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ..‘ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి మంచి అవకాశం. స్థానిక సమస్యలు మీద నాయకులు పోరాటం చేయాలి. ఉత్తరాంధ్ర నిర్లక్షం చేయబడిన ప్రాంతం. అన్ని వనరులు ఉండి ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరంగా ఉంది. విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన 23 సంస్థల్లో ఒకటి కూడా చంద్రబాబు శ్రీకాకుళంలో పెట్టలేదు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ 800 కోట్లతో ఏర్పాటు చేశారు. మూలపేటలో 3,600 కోట్లతో పోర్ట్ ఏర్పాటు చేశారు. 300 కోట్లతో ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేశారు. దివంగత నేత వైయస్సార్, వైఎస్ జగన్ హయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. స్టీల్ ప్లాంట్‌పై మన వైఖరి స్పష్టంగా ఉంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు.