
విజయవాడ ఎయిర్‌పోర్టులో పవన్ (ఫైల్ ఫొటో)
హైదరాబాద్/అమరావతి, సాక్షి: జ్వరంతో రాజకీయాలకు, తన విధులకు స్వల్ప విరామం తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి బిజీ అయ్యారు. ఏపీ కేబినెట్ సమావేశం నేపథ్యంలో స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు.
వైరల్ ఫీవర్ కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్ వచ్చారని ఆయన సిబ్బంది అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడికి వచ్చాక ఆయన జ్వరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాగూ వచ్చా కదా అని.. హైదరాబాద్‌లో అన్నయ్య చిరు అండ్ మెగా ఫ్యామిలీతో కలిసి ఓజీ స్పెషల్ ప్రివ్యూ వేసుకుని చూశారు. అంతేకాదు.. ఓజీ సక్సెస్ మీట్‌లలో హుషారుగా పాల్గొని సందడి చేశారు. అఫ్‌కోర్స్.. ఈ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పవన్‌ను పరామర్శించారు అది వేరే విషయంలేండి. మరోవైపు..
అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్న టైంలో సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ’’ చేసిన వ్యాఖ్యలు.. వాటిపై స్పందించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ చిరు ఒక బహిరంగ ప్రకటనతో తేల్చేయడంతో బాలయ్యపై అటు మెగా అభిమానులు, ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడాన్ని ఇటు చిరు ఫ్యాన్స్‌తో పాటు అటు జనసేన కార్యకర్తలే ఒకానొక దశలో భరించలేకపోయారు. మరి జ్వరం తగ్గింది కదా.. పొలిటికల్ అవతార్‌లోకి మారిపోయారు కదా.. ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి అంటున్నారు పలువురు నెటిజన్లు.