నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'.. ఈ సంక్రాంతికి కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న వస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో నవీన్ పొలిశెట్టి పలు వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు తాను ఏ హీరోల సినిమాలైతే థియేటర్‌కి వెళ్ళి చూసేవాడినో.. ఇప్పుడు ఆ అభిమాన హీరోల సినిమాలతో పాటు, తన సినిమా విడుదలవుతుండటం సంతోషంగా ఉందన్నారు.
ప్రభాస్ పెళ్లి తర్వాతే నేను చేసుకుంటా
'అనగనగా ఒక రాజు' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన పెళ్లి గురించి నవీన్ పొలిశెట్టి ఇలా అన్నారు. 'ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు 12 గంటలకు నా పెళ్లి ఉంటుంది.' అంటూ సరదాగా చెప్పారు. అయితే, ప్రభాస్ అన్నయ్యతో తన స్నేహం చాలా గొప్పదని ఆయన చెప్పుకొచ్చారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, పతంగ్‌లు, మీనాక్షి చౌదరి కామన్ అయిపోయిందన్నారు. ఏజెంట్ సాయి, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఈ మూడు చిత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయని గుర్తుచేశారు. ఇప్పుడు రాబోయే 'అనగనగా ఒక రాజు' కూడా సరికొత్తగా మెప్పిస్తుందని తెలిపారు.
ఫస్ట్ ప్రభాస్ సినిమా.. ఆ తర్వాత చిరు మూవీ వెళ్తా..
'ఈ సంక్రాంతికి విడుదలవుతున్న చిరంజీవి గారి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ గారి 'ది రాజా సాబ్'తో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రభాస్ అన్నయ్య నేనూ మంచి స్నేహితులం.. మా మధ్య పోటీ ఉండదు. మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందారు. సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ఎవరైనా సరే ఇండస్ట్రీలో స్టార్ అవ్వవచ్చని పలువురికి దారి చూపించిన వ్యక్తి ఆయన.. పరిశ్రమలో నాలాంటి వారికి ఎందరికో ఆయన దారిచూపించారు. అలాంటి గురువుగారి సినిమా వస్తుంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు.. నేనైతే ఫస్ట్ ప్రభాస్ అన్నయ్య సినిమా చూసి.. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకు వెళ్తాను. అటునుంచి నా సినిమాకు వెళ్తా.' అని నవీన్ పొలిశెట్టి అన్నారు.


