
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
‘‘ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలని కోరితే ఎలా?. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో సంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగు నీరు, ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు?.. దయచేసి న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
మరోవైపు.. రాజకీయ ర్యాలీలు, సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ లాయర్.. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోదని తెలిపారు.
అలాగే.. రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో అంగీకరించింది. మరోవైపు.. బాధితులకు పరిహారం పెంపు పిటిషన్‌కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో కుట్ర కోణం ఉందని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే ఓ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండింటితో పాటు కరూర్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది.