తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. మద్రాస్ హైకోర్టు నిర్ణయంపై ఈ సినిమా విడుదల ఆధారపడి ఉంది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం జనవరి 9న జన నాయగన్ రిలీజ్ కావాల్సివుంది. అయితే మద్రాస్ హైకోర్టు తమ నిర్ణయాన్ని అదేరోజు ప్రకటిస్తామని చెప్పడంతో సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు కోసం విజయ్ అభిమానులు, మద్దతుదారులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
జన నాయగన్ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో నిశితంగా గమనిస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ తరపున హైకోర్టులో వాదనలు విన్పిస్తున్న ప్రముఖ న్యాయవాది సతీశ్ పరాశరణ్ (Satish Parasaran) గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళ చిత్ర పరిశ్రమతో ఆయన దగ్గర సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. విలక్షణ నటుడు కమల్‌హాసన్ మేనల్లుడైన సతీశ్.. కోర్టులో పదునైన వాదనలతో సీబీఎఫ్‌సీ ప్రతినిధులకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారని అభిమానులు అంటున్నారు.
ఎవరీ సతీశ్ పరాశరణ్?
కమలహాసన్ సోదరి సరోజ కుమారుడే సతీశ్ పరాశరణ్. ఈయన తండ్రి కె. పరాశరణ్ 1983-89 వరకు భారత అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్ నుంచి సతీశ్ న్యాయవిద్య పూర్తి చేశారు. తర్వాత తమిళనాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.
కమల్ హాసన్ (Kamal Haasan) సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ తరపున కూడా పలు సందర్భాల్లో కోర్టుల్లో వాదనలు వినిపించారు. కమల్ సినిమాలకు అడ్డంకులు ఎదుర్కొన్నప్పుడల్లా ఆయన కోర్టులో ప్రత్యక్షమయ్యేవారు. గత ఏడాది థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధించినప్పుడు సతీశ్ పరాశరణే వాదించారు.
చదవండి: 'జన నాయగన్' వాయిదా.. భారీగా రీఫండ్
సతీశ్ పరాశరణ్‌పైనే ఆశలు
ఇండియన్ 2 సెట్ ప్రమాదం విషయంలో కమల్‌హాసన్‌కు మద్రాస్ హైకోర్టు సమన్లు జారీ చేసినప్పుడు కూడా ఆయన తరపున కేసు వాదించారు. 2020లో ఇండియన్ 2 సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రమాదం సంభవించడంతో ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జన నాయగన్ సినిమా విడుదల విషయంలో విజయ్ అభిమానులు సతీశ్ పరాశరణ్ వాదనలపై ఆశలు పెట్టుకున్నారు. మద్రాస్ హైకోర్టు రేపు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.


