చెన్నై: త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడులో డాక్టర్ అన్బుమణి రామదాస్ సారథ్యంలోని పాట్టలి మక్కల్ కట్చి(పీఎంకే) చీలిక వర్గం పార్టీ బుధవారం ఎన్‌డీఏ కూటమితో జతకట్టింది. తమిళనాడులో ఎన్‌డీఏ కూటమికి సారథ్య బాధ్య తలు చూసుకుంటున్న అన్నాడీఎంకే పార్టీ చీఫ్ కె.పళనిస్వామి పిలుపుమేరకు ఆ కూటమిలో చేరుతున్నట్లు అన్బుమణి ప్రకటించారు.
బుధవారం చెన్నైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి కూడా అయిన పళనిస్వామి నివాసంలో అన్బుమణి భేటీ అయ్యారు. తర్వాత మీడియాతో పళనిస్వామి మాట్లాడారు. ‘‘ మా కూటమిలో ఇప్పుడే పీఎంకే చేరింది. మరిన్ని పార్టీలు మాతో త్వరలో జతకట్టబోతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి పీఎంకేకు సీట్ల సర్దుబాటు ఇప్పటికే జరిగిపోయింది. ఎన్ని సీట్లు కేటాయించామనేది త్వరలో∙వెల్లడిస్తాం’’ అని పళనిస్వామి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న డీఎంకే పార్టీని ఓడించేందుకే ఎన్‌డీఏ కూటమిలో జతకట్టానని అన్బుమణి స్పష్టంచేశారు.


