టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు | CBI Notices to TVK Chief Vijay | Sakshi
Sakshi News home page

టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు

Jan 6 2026 2:18 PM | Updated on Jan 6 2026 5:38 PM

CBI Notices to TVK Chief Vijay

సాక్షి, ఢిల్లీ: కోలీవుడ్‌ స్టార్‌ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ నోటీసులు జారీ చేసింది. కరూర్‌ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయన్ని విచారించాలని భావిస్తోంది. ఈ నెల 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే.. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో విజయ్‌ను సీబీఐ విచారణ జరిపే అవకాశం కనిపిస్తోంది.  

సెప్టెంబర్‌ 27న టీవీకే పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐజీ ఆశా గార్గ్‌ నేతృత్వంలోని సిట్‌ తొలుత దర్యాప్తు చేపట్టింది. దీనిని సవాల్‌ చేస్తూ.. టీవీకే సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. 

తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్‌పై నమ్మకం లేదని, సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీన్ని విచారించిన జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను ‘సీబీఐ’కి అప్పగిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు..

సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ రస్తోగి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సీబీఐ బృందం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. కరూర్‌లోని ఘటన స్థలాన్ని పరిశీలించింది. బాధితులు, సంబంధిత కుటుంబాల వాంగ్మూలాలను సేకరించింది. ఆపై విచారణను ముమ్మరం చేసింది. 

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement