
వివాహం ఏ అమ్మాయికైనా తన కలలను కనడమే మరిచిపోయేలా బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సపోర్టు ఉంటే తనను తాను ప్రూవ్ చేసుకునేలా ఎదుగుతుంది. లేదంటే వంటిటికే పరిమితమవ్వాల్సిందే. కానీ అలాంటి మూసపద్ధతులన్నింటిని బద్దలుకొట్టుకుంటూ దూసుకొచ్చింది ఈ మహిళ. ఓ పక్క పేదరికం, మరోవైపు ఇంటి బాధ్యతలు అయినా.. తన కలలు కల్లలుగా మారనివ్వ లేదు. తాను అనుకున్నది సాధించడం కోసం గుక్కపెట్టి ఏడిపించేలా చేస్తున్న కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని..గృహిణులు కూడా ఉన్నతాధికారుల కాగలరని చాటి చెప్పింది
ఆ ధీర వనితే అంజు యాదవ్(Anju Yadav). 1988లో హర్యానాలోని నార్నాల్ జిల్లాలోని చోటే అనే గ్రామంలో జన్మించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తండ్రి లాల్‌రామ్ వ్యవసాయం, పార్చున్ దుకాణం సాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. తల్లి సుశీలా దేవి గృహిణి. ఆమెకు ముగ్గురు సోదరీమణులు. బీఏ వరకు తన గ్రామంలోనే చదువుకున్న అంజు 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 22 ఏళ్లకే తల్లి అయ్యి ముకుల్‌దీప్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయినా సరే తన డ్రీమ్ ఆగిపోకూడదనుకుంది. తల్లిగా, భార్యగా ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ సతమతమైంది. తన లక్ష్యానికి నెరవేర్చుకునేందుకు అత్తమామలు ముందుకు రాకపోవడంతో తల్లి సాయం తీసుకుంది. ఆమెకు తన కొడుకు బాధ్యతను అప్పగించి తన కెరీర్‌పై దృష్టిసారించింది. అలా ఎలాంటి కోచింగ్ లేకుండా బీఈడీ సీటు సంపాదించి ఏకంగా మూడుసార్లు పలు చోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది.
ఇక ఆ సమయంలో తల్లి ఆమెకు మద్దతిచ్చి..కొడుకు ముకుల్‌దేవ్ బాధ్యతను తీసుకుంది. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలన్న ఆరాటంతో సాగిపోతున్న అంజుకి భర్త అనారోగ్యం ఆమెను మరింత దుఃఖంలోకి నెట్టేసింది. సరిగ్గా ఆ సమయంలో రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) రిక్రూట్‌మెంట్ వచ్చింది. ఆ బాధను దిగమింగుకుని మరీ ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకుంది. ఆ డీఎస్పీ ఎగ్జామ్‌కి సన్నద్ధమవుతుండగా భర్త నిత్యానంద్‌రావు అనారోగ్యంతో మరణించడంతో ఒంటరి తల్లిగా నానా ఇబ్బందులు పడింది.
ఆ కష్ట సమయంలో తల్లిదండ్రులు మద్దతివ్వడంతో..ఆహర్నిశలు కష్టపడి ప్రిపేరయ్యింది. అలా 2023లో 1725 ర్యాంకు సాధించి డీఎస్సీ అయ్యింది. చివరికి సెప్టెంబర్ 2025కి విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాజస్తాన్ పోలీస్ సర్వీస్‌లో డీఎస్పీ(Deputy Superintendent of Police )గా విధులు నిర్వర్తిస్తోంది. ఓ మారుమూల గ్రామంలో వివాహితురాలిగా మారిన తర్వాత కూడా అంజు కలలు కనడం ఆపలేదు.
ఎన్ని రకాలుగా తనను అణిచివేసేలా ఇబ్బందులు వచ్చి పడినా అధైర్యపడలేదు. ఏదో ఒక నాటికి తను అనుకున్న గుర్తింపు సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందుకు సాగింది. చివరకు సుదీర్ఘ పోరాటం అనతరం తన కలను నెరవేర్చుకుంది .కష్టపడేతత్వం ఉంటే కల ఎప్పటికైనా నెరవేరి తీరుతుంది అనేందుకు ఉదాహరణగా నిలిచి.. 'దటీజ్ అంజు యాదవ్' అని అనిపంచుకుంది .
(చదవండి: అందాలపోటీలకు అంతరాయం కలిగించిన భూకంపం..! వీడియో వైరల్)