
ఢిల్లీ: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ సతీమణి గరిమా సైకియా గార్గ్ సంచలన ఆరోపణలు చేశారు. లైఫ్ జాకెట్ లేకుండా తన భర్తను నీటిలోకి ఎందుకు దింపారని ప్రశ్నించారు. అతను నీరసంగా ఉన్న సమయంలో నీటి వద్దకు ఎందుకు తీసుకెళ్లారని పలు ప్రశ్నలు సంధించారు. మరోవైపు.. జుబీన్ కేసులో మరో ఇద్దరిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
జుబీన్ సతీమణి గరిమా తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జుబీన్ మృతి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలను బట్టి ఆరోజు ఆయన చాలా అలసిపోయాడని స్పష్టంగా తెలుస్తుంది. జుబీన్‌కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇంతకు ముందకు పలుమార్లు మూర్ఛ కూడా వచ్చింది. ఈ విషయం అందరికీ తెలుసు. వైద్యులు అతన్ని నీటి దగ్గరకు వెళ్లవద్దని సూచించారు. అతన్ని ఎప్పుడూ డ్రైవ్ చేయడానికి కూడా అనుమతించలేదు. అయినప్పటికీ, అతన్ని బోటులో జరుగుతున్న పార్టీకి ఎందుకు తీసుకెళ్లారు. లైఫ్ జాకెట్ లేకుండా ఈత కొట్టడానికి ఎలా అనుమతించారు. ఎవరూ అతన్ని ఎందుకు సరిగ్గా చూసుకోలేదు?. వైద్య సహాయం లేదా భద్రతా సహాయం ఎందుకు లేదు? అతను నా భర్త మాత్రమే కాదు. అస్సాం హృదయ స్పందన. ఆయన విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం క్షమించరానిది. జుబీన్‌తో నేను చివరిసారిగా సెప్టెంబర్ 18న మాట్లాడాను. బోటులో పార్టీ గురించి ఆయన నాతో ఏమీ చెప్పలేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
Zubeen was not just my husband—he was a legendary artist, the heartbeat of millions. He was lovingly called the heartthrob of Assam, and even of North East India: Garima Saikia Garg, Zubeen Garg's wife#ZubeenDaForever #ZubeenGarg #NewsTrack | @MaryaShakil pic.twitter.com/UMfVWryrxV
— IndiaToday (@IndiaToday) October 2, 2025
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గార్గ్ సహ సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి, సహ గాయకురాలు అమృతప్రభ మహంతలను పోలీసులు అరెస్టు చేశారు. గార్గ్‌కు అత్యంత సన్నిహితులైన వీరు ఆయన మరణ సమయంలో సింగపూర్‌లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. తగిన ఆధారాలు ఉన్నందునే వారిని అదుపులోకి తీసుకొన్నామని, విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని సీనియర్ అధికారి ఒకరు విలేకరులతో పేర్కొన్నారు. అంతకు ముందు.. నార్త్‌ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, జుబీన్‌గార్గ్ మేనేజర్ సిద్ధార్థశర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.