
యూపీ యువ వ్యాపారి అభిషేక్ గుప్తా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హిందూ మహాసభ(ABHM) నేత పూజా శకున్ పాండే భర్త అశోక్ పాండేను, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజ కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిషేక్ తండ్రి సంచలన ఆరోపణలకు దిగాడు. వివాహేతర సంబంధమే ఈ ఘాతుకానికి కారణమని చెబుతున్నాయాన.
అలీఘడ్‌లో ఓ బైక్ షోరూమ్ ఓనర్ అయిన అభిషేక్ గుప్తా(30) సెప్టెంబర్ 23వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. తండ్రి, కజిన్‌తో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అబిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు పూజా శకున్ పాండే(Pooja Shakun Pandey) భర్తను అశోక్‌ను, కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్‌ను అరెస్ట్ చేశారు. అయితే..
పూజతో తన కొడుక్కి వివాహేతర సంబంధం ఉందని, దాని నుంచి బయటపడే క్రమంలోనే దారుణ హత్యకు గురయ్యాడని అభిషేక్ తండ్రి ఆరోపిస్తున్నారు. సుపారీ హంతకుడికి డబ్బులు చెల్లించి ఆ జంట ఈ హత్య చేయించిందని చెబుతున్నారు. దీంతో ఇప్పటిదాకా కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని భావిస్తూ వచ్చిన అలీఘడ్ పోలీసులు.. ఆ కోణంలోనూ దర్యాప్తునకు సిద్ధమయ్యారు.

అభిషేక్ తండ్రి ఏమన్నారంటే..
పూజా శకున్ పాండేకి, తన కొడుకుకి మధ్య వివాహేతర సంబంధం ఉందని నీరజ్ గుప్తా మీడియాతో చెప్పారు. ‘‘నా చిన్న కొడుకు వివాహ సమయంలో ఆమె(పూజా శకున్) నానారచ్చ చేసింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ అభిషేక్‌పై ఒత్తిడి తెచ్చింది. ఇదే విషయాన్ని అతను నా భార్య(అభిషేక్ తల్లి)కి చెప్పాడు. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడ పూజను వివాహం చేసుకుంటాడో మేం అని ఆందోళన చెందాం. చివరకు ఆమె నెంబర్ బ్లాక్ చేసి దూరం పెట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలోనూ ఆమె మాతో గొడవ పెట్టుకుంది. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదంది. అంతేకాదు.. అభిషేక్ వ్యాపారం మొదలుపెట్టిన సమయంలోనూ తనను భాగస్వామిగా చేర్చుకోవాలంటూ మమ్మల్ని బెదిరించింది అని సంచలన ఆరోపణలు చేశాడాయన.
నిందితుడి అరెస్ట్‌తో..
ఈ నేరంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండొచ్చని తొలుత భావించిన పోలీసులు.. అందరినీ విచారించారు. చివరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. అభిషేక్ గుప్తాను కాల్చి చంపిన మహమ్మద్ ఫజల్‌ను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3 లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూజ, ఆమె భర్త ఇద్దరూ అభిషేక్ ఫొటో చూపించారని, రూ.1 లక్ష ముందుగా చెల్లించారని వెల్లడించాడు. రెక్కీ నిర్వహించి మరీ ఈ హత్య చేసినట్లు ఫజల్ అంగీకరించాడు. దీంతో అశోక్ పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న పూజా, ఫజల్‌కు సహకరించిన అసిఫ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
అభిషేక్ తండ్రి మాకు బాకీ ఉన్నాడు
అరెస్ట్ సమయంలో అశోక్ పాండే మీడియాతో మాట్లాడాడు. అభిషేక్ తమకు చిన్నప్పటి నుంచి తెలుసని, అతను తమ దగ్గరే ఉండి చదువుకున్నాడని, అతని కోసం తాము చాలా చేశామని చెప్పాడు. అంతేకాదు.. అభిషేక్ తండ్రి తమకు రూ.10 లక్షల బాకీ ఉన్నాడని, అందుకే తమను ఈ కేసులో కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు ఆరోపించాడు.
పోలీసులేమన్నారంటే..
కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు నియమించామని, అభిషేక్ తండ్రి చేస్తున్న ఆరోపణలు ఇంకా ధృవీకరణ కావాల్సి ఉందని తెలిపారు. ఫజల్ అరెస్టును ధృవీకరించిన పోలీసులు.. పాండే దంపతులకు ఫజల్ చాలా కాలంగా తెలుసన్నారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన దేశీ పిస్టోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఎవరీ పూజా శకున్?
పూజా శకున్ పాండే.. యూపీ హిందూ మహాసభ నాయకురాలు, సామాజిక కార్యకర్త. ఉమా భారతితో పాటు పలువురు బీజేపీ పెద్దలకు ఆమె బాగా దగ్గర. ఓ వర్గాన్ని ఊచకోత కోయాలంటూ గతంలో ఆమె ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైంది. తనను తాను లేడీ గాడ్సే(Lady Godse)గా అభివర్ణించుకుంటుందామె. అంతేకాదు. గతంలో జాతి పిత మహత్మా గాంధీని దూషించడం.. గాడ్సేను మహానుభావుడిగా కీర్తించడం లాంటి చర్యలతో వార్తల్లో నిలిచారు. అంతేకాదు.. హిందూ కోర్టు పేరుతో అలహాబాద్, మీరట్‌లలో ఆమె, ఆమె భర్త కలిసి పలు పంచాయితీలు నిర్వహించారామె. ఇది పోలీసుల దాకా చేరడంతో.. వాళ్లు ఆమెకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..

2018 గాంధీ వర్ధంతిన ఆమె చేసిన పని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాడ్సేని దేవుడిగా అభివర్ణిస్తూ ఆమె పూజలు చేసి స్వీట్లు పంచింది. అలాగే.. గాంధీ ఫొటోకు తుపాకీ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఒకవేళ గాడ్సే గనుక చంపకపోతే నేనే చంపేదాన్ని అంటూ అసంబద్ధమైన వ్యాఖ్య ఒకటి చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఆమెపై కేసు నమోదు కావడంతో.. కొన్నిరోజులు జైల్లో గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది.
ఇదీ చదవండి: 50 కోట్ల ఇన్సూరెన్స్.. భార్యాభర్తల నడుమ హైడ్రామా