హైదరాబాద్: నిన్ను ప్రేమిస్తున్నా.. నా ప్రేమను అంగీకరించాలని ఓ యువకుడు ఓ యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడిచేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. అలకాపూర్ టౌన్‌షిప్‌లో ఓ యువతి(21) మరో ఇద్దరు యువతులతో కలిసి ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అదే భవనంలో కొనసాగుతున్న ఓ హోటల్‌లో వెయిటర్‌గా పర్వతాల రోహిత్(23) పనిచేస్తున్నాడు. ఈనెల 1న యువతి కొత్త సంవత్సరం వేడుకల అనంతరం అర్ధరాత్రి ఇంటికి వచ్చింది .
అప్పటికీ ఆమె మిత్రులు రాకపోవటంతో తలుపు తెరచి ఉంచి నిద్రకు ఉపక్రమించింది. రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్న రోహిత్ అదే అదనుగా ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి అతన్ని గమనించి అరవటంతో కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో యువతి చేతికి గాయమైంది. అయినా అతను అసభ్యంగా ప్రవర్తించి పరారయ్యాడు. దీంతో బాధితురాలు ఈనెల 2 నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయమై సెక్టార్ ఎస్సై మునీందర్‌ను వివరణ కోరగా యువతిపై కత్తితో దాడి, అసభ్యంగా ప్రవర్తించిన రోహిత్‌పై ఫిర్యాదు వచ్చిందని, నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.



