
మీరట్: ఉత్తరప్రదేశ్‌లో రూ. 50 కోట్ల బీమా కోసం ఒక వ్యక్తి తన మొదటి భార్య, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే అతని నాల్గవ భార్య ఈ మరణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు సాగించిన భారీ బీమా స్కామ్ వెలుగుచూసింది.
ఒక పథకం ప్రకారం హత్యలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన విశాల్ సింఘాల్(37) తన మొదటి భార్య, తల్లిదండ్రులను హత్య చేసినందుకు హాపూర్‌లో అరెస్టు చేశారు. అతని నాల్గవ భార్య.. విశాల్ సింఘాల్ ఇంటిలో జరిగిన అనుమానాస్పద మరణాలపై పోలీసులను అప్రమత్తం చేశారు. సింఘాల్ తండ్రి ముఖేష్ పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి. వీటిపై కన్నేసిన విశాల్ ఒక పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి, ఇప్పటికే రూ.1.5 కోట్ల క్లెయిమ్‌లను అందుకున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించిన దరిమిలా నివ్వెరపోయే పలు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.
నాల్గవ భార్యపై పాలసీ కోసం ఒత్తిడి
పోలీసుల దర్యాప్తులో విశాల్ సింఘాల్.. తన రెండవ, మూడవ భార్యలు తనను విడిచిపెట్టివెళ్లిపోయారని తెలిపాడు. అయితే పోలీసులు ఈ మాటపైన కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మీరట్‌లోని గంగానగర్‌కు చెందిన సింఘాల్, తన నాల్గవ భార్య శ్రేయను అధిక విలువ కలిగిన జీవిత బీమా పాలసీలపై సంతకం చేసేందుకు ఒప్పించాడు. అయితే సంభాల్‌లో దర్యాప్తు జరుగుతున్న బీమా స్కామ్ గురించి తెలుసుకున్న శ్రేయ అనుమానంతో.. తన భర్త బీమా పాలసీ కోసం తనపై చేస్తున్న ఒత్తిడి గురించి పోలీసులకు తెలిపారు. ‘విశాల్ పాలసీలపై సంతకం చేయమని తనను నిరంతరం ఒత్తిడి చేస్తూ వచ్చాడని, ఇదే సమయంలో అతని కుటుంబంలో గతంలో చోటుచేసుకున్న మరణాలపై తనకు అనుమానాలు వచ్చాయని శ్రేయ పోలీసులకు తెలిపారు.
భారీ బీమా స్కామ్‌లో ఎందరున్నారో..
విశాల్ తండ్రి కూడా తన సహాయం కోరాడని, తనకు ప్రాణ భయం ఉందని చెప్పారన్నారు. విశాల్ తండ్రి చనిపోయిన తర్వాత, తాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయానని శ్రేయ పోలీసులకు వివరించారు. శ్రేయ ఫిర్యాదును పరిశీలించిన సంభాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పీ)కృష్ణకాంత్ బిష్ణోయ్ తాము ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న భారీ బీమా స్కామ్‌లో ఇది ఒక భాగమేనని గుర్తించామని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు తెలిపారు. ఇంటిలోని వారిని హత్య చేసిన దరిమిలా విశాల్ సింఘాల్ వారిపైనున్న బీమా మొత్తాన్ని పొందేందుకు వారు పలు ప్రమాదాల్లో మరణించినట్లు ఆధారాలు సృష్టించాడు. వీటి ఆధారంగా ఇప్పటికే రూ. 1.5 కోట్లు క్లెయిమ్ అందుకున్నాడని బిష్ణోయ్ తెలిపారు.
ఆస్పత్రి యాజమాన్యంపై అనుమానాలు
సింఘాల్ తన ఇంటిలోని వారి పేరుతో పలు జీవిత బీమా పాలసీలను తీసుకొని, వారిని రోడ్డు ప్రమాదానికి బలిచేసి, బాధితులను మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించేవాడు. తరువాత బీమా చెల్లింపును క్లెయిమ్ చేసేవాడు. సింఘాల్ భార్య, అతని తండ్రి ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో మృతి చెందారు. ఇది అనుమానాలకు తావిస్తున్నదని, ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యం పాత్రను పరిశీలిస్తున్నామని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. సింఘాల్ తండ్రి ముఖేష్ మరణించే సమయంలో అతని పేరు మీద రూ. 50 కోట్ల విలువైన 64 యాక్టివ్ పాలసీలు ఉన్నాయి.
రికార్డులపై అనుమానంతో ఫిర్యాదు
2024 మార్చిలో హాపూర్ పోలీస్ స్టేషన్‌లో సింఘాల్ తండ్రికి జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదయ్యింది. దీనిలో అతను గర్హ్ముక్తేశ్వర్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడని పేర్కొన్నారు. అయితే అతని బీమా క్లెయిమ్ పత్రాలలో 2023, మార్చి 27న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని ఉంది. అయితే అతను అడ్మిట్ అయిన నవజీవన్ ఆసుపత్రి రికార్డులతో అతను రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చారని నమోదయ్యింది. దీంతో అనుమానం తెలెత్తిన ఒక బీమా సంస్థ ప్రతినిధి సంజయ్ కుమార్ సెప్టెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘విశాల్ సింఘాల్ తెలిపిన వివరాలకు.. ఆసుపత్రి వర్గాలు అందించిన సింఘాల్ తండ్రి పోస్ట్‌మార్టం రిపోర్టుతో సరిపోలలేదు సంజయ్ కుమార్ పోలీసులకు తెలిపాడు.
తండ్రి మరణించాక వాహన రుణాలు తీర్చేసిన నిందితుడు
కాగా విశాల్ సింఘాల్ సమర్పించిన పత్రాలలో తండ్రి వయస్సు,ఐడీ వివరాలలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించడంలో విశాల్ విఫలమయ్యాడని హాపూర్ ఎస్పీ కున్వర్ జ్ఞానేందర్ సింగ్ తెలిపారు. ఈ కేసు మూసివేశామని, అయితే ఇప్పుడు కేసును తిరిగి తెరవడానికి కోర్టు అనుమతి లభించిందని తెలిపారు. భారీ బీమా స్కామ్ దర్యాప్తుకు సారధ్యం వహిస్తున్న సంభాల్ అదనపు ఎస్పీ అనుకృతి శర్మ మాట్లాడుతూ తండ్రి మరణానికి రెండు నెలల ముందు విశాల్ సింఘాల్ పేరుమీద టయోటా లెజెండర్, నిస్సాన్ మాగ్నైట్, బ్రెజ్జా, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సంబంధించిన రుణాలు ఉన్నాయని, అయితే అవి అతని తండ్రి మరణం తర్వాత క్లియర్ అయ్యాయని అనుకృతి శర్మ తెలిపారు. విశాల్ సింఘాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.