సాక్షి,హైదరాబాద్: పిల్లా,పాపలతో హాయిగా సాగిపోతున్న సంసారంలో కుటుంబ సమస్యలు ఘోర విషాదాన్ని నింపాయి. కొడుకు,కుమార్తెను ఉరేసి చెరువులో పడేశాడో తండ్రి. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేరు గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన శివరాములు తన కూతురు రితిక, కొడుకు చైతన్యను ఉరిసే స్థానిక చెరువులో పడేశాడు. అనంతరం, విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు స్పందించి అతడిని మహబూబ్ నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీలేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చిన్నారుల అమాయక ప్రాణాలు ఇలా బలైపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
తీలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటన కుటుంబ సమస్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో మరోసారి స్పష్టంచేసింది. శివరాములు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, గ్రామం మొత్తం ఈ దారుణంతో కన్నీటి సంద్రమైంది.


