ప్రజలు భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారు
బెంగాల్ సీఎం మమత ఆరోపణలు
సాగర్ ఐల్యాండ్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళతామని టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఎస్‌ఐఆర్ అధికారుల వేధింపులు, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు భయాందోళనలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారని ఆమె ఆరోపించారు.
దక్షిణ 24 పరగణాల జిల్లా సాగర్ ఐల్యాండ్‌లో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడారు. ఎస్‌ఐఆర్ సిబ్బంది ఎలాంటి సహేతుక కారణాలను చూపకుండానే అర్హులైన ఓటర్ల పేర్లను ఏకపక్షంగా తొలగిస్తున్నారని విమర్శించారు. మామాలుగా చేపట్టే ఈ ప్రక్రియను ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ఆయుధంగా వాడుతున్నారని ఆరోపించారు. ఓటర్ల పట్ల అమానవీయంగా వ్యవహరించడం, ఎస్‌ఐఆర్ నేపథ్యంలో సంభవిస్తున్న మరణాలపై 6న(మంగళవారం) కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.
ఓ సాధారణ పౌరురాలిగా అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టు తలుపు కూడా తడతానన్నారు. ‘నేను కూడా అనుభవమున్న లాయర్‌నే’అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఈ పిటిషన్‌ను వ్యక్తిగతంగా వేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం లేక టీఎంసీ పక్షానా అనే విషయం ఆమె స్పష్టంగా తెలపలేదు. వ్యాధి గ్రస్తులు, వృద్ధులు కూడా తాము అర్హులైన ఓటర్లమే అని నిరూపించుకోవాల్సి వస్తోందన్నారు. ఏమాత్రం కనికరం చూపకుండా ఎస్‌ఐఆర్ సిబ్బంది వారినీ క్యూలలో నిల్చోబెడుతున్నారని ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే వలస కార్మికులపై వివక్ష చూపుతున్నారని మమత చెప్పారు. బెంగాలీలో మాట్లాడటం ఈ దేశంలో నేరమైపోయిందంటూ ఆమె..‘నన్ను చంపినా సరే, బెంగాలీలోనే మాట్లాడుతా’అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజలు తాయిలాలు చూపే బీజేపీ.. గెలిచిన తర్వాత అణచివేతలకు పాల్పడుతుందని హెచ్చరించారు. ‘ఎన్నికలకు ముందు తలా రూ.10 వేలు పంచిపెడుతుంది.. ఆ తర్వాత వారిపైకి బుల్‌డోజర్లను నడుపుతుంది’అంటూ బీజేపీపై ధ్వజమెత్తారు.


