బోయ పరమేష్ (ఫైల్) , బోయ వెంకటేష్(ఫైల్)
కర్నూలు జిల్లాలో పడగ విప్పిన పాతకక్షలు
2023లో జరిగిన జంట మరణాలకు ప్రతీకారం
మూడు నెలలుగా స్నేహపూర్వకంగా నటిస్తూ దారుణం
ఇరువురు అక్కడికక్కడే మృతి
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని కందనాతి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. ఒకే సామాజిక వర్గం, అధికార తెలుగుదేశంపార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య 2023లో జరిగిన జంట మరణాలకు ప్రతీకారంగా సోమవారం ఈ హత్యలు జరిగాయి. వేటకొడవళ్లు, గడ్డపారలతో పథకం ప్రకారం రెండు గ్రూపులుగా విడిపోయి ప్రత్యర్థి కుటుంబంపై విరుచుకుపడ్డారు. వేర్వేరు చోట్ల జరిగిన దాడిలో అన్నదమ్ములు బోయ వెంకటేష్ (49), బోయ పరమేష్ (44) అక్కడికక్కడే మృతి చెందగా, తమ్ముడు బోయ గోవిందు, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ముగ్గురిలో మృతుడు పరమేష్ భార్యతోపాటు గాయపడిన గోవిందు భార్య, కుమారుడు ఉన్నారు.
రెండేళ్ల కిందట కుళాయి దగ్గర గొడవ ప్రారంభం
కందనాతి గ్రామంలో 2023 ఫిబ్రవరిలో దేవర మహోత్సవం సందర్భంగా కుళాయి నీటి కోసం జరిగిన ఘర్షణలో ఒక వర్గం బిర్యాని గరెటతో దాడి చేయడంతో బిక్కి నరసింహులు, కుమారుడు బిక్కి రవి మృతి చెందారు. ఈ ఘటన జరిగినప్పుడే ప్రతీకారం తీర్చుకుంటామని నరసింహులు కుటుంబం శపథం చేసింది. దీంతో భయంతో 12 కుటుంబాలు గ్రామం వదలి వేర్వేరు గ్రామాల్లో తలదాచుకున్నాయి.
ప్రతీకారంతో ఉన్న బిక్కి నరసింహులు వారసులు ప్రత్యర్థి వర్గాన్ని గ్రామంలోకి రప్పించేందుకు పథకం రచించి గ్రామ పెద్దలతో పోలీసులకు సమాచారం అందించారు. వీరి స్నేహపూర్వక మాటలు నమ్మిన బోయ వెంకటేష్, బోయ పరమేష్, గోవిందులతో పాటు 12 కుటుంబాలు 2025 దసరా పండగకు పోలీసుల సమక్షంలో గ్రామానికి చేరుకున్నారు. అయితే ఒకపక్క స్నేహంగా మెలుగుతూనే మరోపక్క హత్యాకాండకు నరసింహులు వారసులు రెక్కీ నిర్వహించారు. సోమవారం గ్రూపులుగా విడిపోయి ప్రతీకార దాడికి పాల్పడ్డారు.
మూడు చోట్ల దాడులు
⇒ గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన బోయ గోవిందు, భార్య వీరేశమ్మ, కుమారుడు లోకేశ్ సోమవారం పనులు ముగించుకొని ట్రాక్టర్‌లో కట్టెలు వేసుకొని ఇంటికి వస్తున్నారు. అప్పటికే కాపుకాసి ట్రాక్టర్‌కు అడ్డువచ్చిన ప్రత్యర్థుల్లో ఒక గ్రూప్ దాడికి పాల్పడింది. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న బోయ గోవిందును గడ్డపారతో కడుపులో పొడవడంతో పేగులు బయటపడ్డాయి. పక్కనే కూర్చున్న భార్య వీరేశమ్మకు, కుమారుడు లోకేశ్‌కు గాయాలయ్యాయి. అయితే గోవిందు భార్య, కుమారుడిని కిందకు దించి ట్రాక్టర్ దిగకుండా వేగంగా నడుపుకుంటూ ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. గోవిందు కడుపు నుంచి పేగులు బయటపడ్డా ట్రాక్టర్ నడుపుకుంటూ పోలీసుస్టేషన్‌కు చేరుకోవడం గమనార్హం.
⇒ మరో గ్రూపు పొలం దగ్గర ఉన్న బోయ వెంకటేష్‌ను చుట్టుముట్టి అతికిరాతకంగా తలపై నరకటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
⇒ అక్కడి నుంచి రెండు గ్రూపులు కలసి బోయ పరమేష్ ఇంటి మీదకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గమనించిన పరమేష్ ఇంటి తలుపులు వేసుకోగా భార్య జయలక్ష్మి ‘మా ఆయన లేడు మామా’ అంటున్నా బండ బూతులు తిడుతూ ఆమె కాలిపై వేడకొడవలితో నరికారు. లోపల దాక్కున్న పరమేష్ను విచక్షణారహితంగా నరకడంతో రక్తం మడుగులో పడిపోయాడు.
ఇరువురి పరిస్థితి విషమం
ప్రత్యర్థుల దాడి నుంచి తప్పించుకున్న గోవిందును పోలీసులు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోవిందు భార్య వీరేశమ్మ, కుమారుడు లోకేశ్‌కు ప్రథమ చికిత్స అందించారు. దాడిలో గాయపడ్డ పరమేష్ భార్య జయలక్ష్మిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గోవిందు, లోకేశ్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతోకర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు బోయ వెంకటేష్‌కు భార్య ఉసేనమ్మ, కుమార్తె రాజేశ్వరి, కుమారుడు మహనందిలు ఉన్నారు. బోయ పరమేష్కు భార్య జయలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు పూజ, రాణి, శివాణి, కుమారుడు మహేంద్రలు ఉన్నారు. ఎస్పీ విక్రాంత్‌పాటిల్ , డీఎస్పీ ఎంఎన్ భార్గవి, సీఐ చిరంజీవి గ్రామానికి వెళ్లి హత్యల తీరును పరిశీలించారు.


