ఈ నెల 23న అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతులు
28 నుంచి మార్చి 31 వరకు వివిధ దశల్లో ఆందోళనలు
ఏప్రిల్ 4న విజయవాడలో మహాధర్నా
బహుజన టీచర్స్ ఫెడరేషన్ వెల్లడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని బహుజన టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపతి రామారావు, చిట్టేటి రమేష్ ఆక్షేపించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీటీఏ ఆధ్వర్యంలో దశల వారీగా చేపట్టనున్న పోరాటాల కార్యాచరణను శనివారం వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వారు మండిపడ్డారు.
పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం, మధ్యంతర భృతి ప్రకటించకపోవడం, 4 పెండింగ్ డీఏల మంజూరు, తమకు ఇవ్వాల్సిన రూ.34,000 కోట్ల బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో పాటు ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనకు కార్యాచరణ ప్రకటించారు.
ఈ నెల 23 నుంచి 25 వరకు జిల్లా స్థాయిలో అధికారులకు, అనంతరం ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. అనంతరం ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి మార్చి31 వరకు వివిధ దశల్లో నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 4న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.


