
ప్రముఖ గాయకుడు, కింగ్ ఆఫ్ హమ్మింగ్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్‌లో ఈవెంట్ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్‌లోని అతడి అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.
సింగర్ అనుమానాస్పద మృతి
సింగపూర్‌లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.
ఎవరీ జుబీన్ గార్గ్?
జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్‌గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.
చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్‌పై కేసు