
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆమె భర్త డేవిడ్ వేధిస్తున్నారంటూ వారి పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీజులు డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ (22) షేక్‌పేటలోని వెస్ట్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా చేరింది. అక్కడ చేరినప్పటినుంచి డింపుల్, డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వకుండా రోజూ హింసిస్తున్నారని ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం
మంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబెట్టి కొట్టేందుకు యత్నించారని ఆరోపించింది. వీడియో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా డేవిడ్ బలవంతంగా తన ఫోన్ లాక్కొని కిందపడేసి పగలగొట్టాడని పేర్కొంది. తన తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారని భయాందోళన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డింపుల్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గల్ఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతి.. యురేఖ, ఖిలాడి, రామబాణం సినిమాలు చేసింది. గద్దలకొండ గణేశ్‌లో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

చదవండి: నవంబరులో కొదమసింహం