
పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు తమ ఆదాయ వ్యాయాలు, పెట్టుబడులు.. ఇలా అన్నింటి గురించి సరైన సమాచారం ఇవ్వాలి. ఇలా ఇచ్చిన సమాచారం అంతా సరైనదని ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) భావిస్తే ఎటువంటి స్క్రూటినీ ఉండదు. కానీ సాధారణంగా కొంతమంది కొన్ని చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు. అవే తరువాత వారికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి.
ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (Income Tax Returns) దాఖలుకు గడువు ముగిసింది. పెనాల్టీతో ఐటీఆర్ ఫైల్ చేసేందుకు మాత్రం అవకాశం ఉంది. దాఖలైన రిటర్న్లపై ఆదాయపు పన్ను శాఖ పరిశీలన కొనసాగుతోంది. ఈ పరిశీలన సమయంలో ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల గురించి చిన్న తప్పుడు సమాచారాన్ని గుర్తించినా వారి పాత రికార్డులన్నింటినీ శోధించవచ్చు. ఐటీఆర్ (ITR) ఫిల్లింగ్లో చేసిన ఎలాంటి ఏ తప్పులకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయో ఇప్పుడు చూద్దాం..
సరైన సమాచారం ఇవ్వకపోవడం
ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో అన్ని ఆదాయ వనరులు, పెట్టుబడుల వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. తప్పులు చేస్తే శాఖ పాత రికార్డులన్నీ పరిశీలించవచ్చు.
సమయానికి ఫైలింగ్ చేయకపోవడం
మీ ఆదాయం మినహాయింపు పరిమితికి మించి ఉంటే తప్పనిసరిగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఆలస్యం చేస్తే నోటీసులు రావచ్చు.
టీడీఎస్లో పొరపాట్లు
టీడీఎస్ (TDS) డిడక్షన్, ఐటీఆర్లో పేర్కొన్న మొత్తం మధ్య వ్యత్యాసం ఉంటే ఐటీ శాఖ నోటీసు పంపుతుంది. ఫైలింగ్ ముందు టీడీఎస్ స్టేట్మెంట్‌ను ధృవీకరించాలి.
ఆదాయ పూర్తి వివరాలు ఇవ్వకపోవడం
సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, ఆర్డీ వంటి వాటి నుండి వచ్చే వడ్డీ ఆదాయాన్ని దాచడం వల్ల సమస్యలు వస్తాయి. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని అన్ని వనరులు పేర్కొనాలి.
అసాధారణ లావాదేవీలు
మీ ఆదాయానికి అనుగుణంగా కాకుండా పెద్ద మొత్తాలు డిపాజిట్ చేస్తే శాఖ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారు రూ.12 లక్షలు డిపాజిట్ చేస్తే విచారణకు గురవుతారు.