
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 3,759 డాలర్ వద్ద ట్రేడవుతోంది.
భారత్కు సరిహద్దున ఉన్న నేపాల్లోనూ బంగారానికి మంచి డిమాండే ఉంటుంది. దీంతో ఇక్కడ బంగారం ధర ప్రస్తుతం టోలాకు (11.66 గ్రాములు) రూ.2,23,200 (నేపాలీ రూపాయలు) లకు చేరింది. భారత రూపాయితో పోలిస్తే నేపాలీ రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. ఒక్క భారత రూపాయి 1.6 నేపాలీ రూపాయలకు సమానం.
ఇక భారత్ విషయానికి వస్తే బంగారం ధరలు (Gold Rate) గత వారం రోజులుగా స్థిరమైన పెరుగుదలను చూశాయి. కాలానుగుణ డిమాండ్, స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా విస్తృత జాతీయ, ప్రపంచ ధోరణికి అనుగుణంగా పసిడి ధరలు ఎగిశాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ .11,548 వద్ద ఉంది. ఇది వారం క్రితం ఉన్న రూ .11,215 తో పోలిస్తే రూ .333 పెరిగింది. అంటే తులానికి (10 గ్రాములు) రూ.3300 పెరిగి రూ.1,15,480 కి చేరింది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.305 పెరిగి రూ.10,280 నుంచి రూ.10,585కు చేరుకుంది. వారం రోజుల్లో తులం బంగారం ధర ఏకంగా రూ.3050 పెరిగి రూ.1,05,850 లకు ఎగిసింది.