ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్.. కుమార్ మంగళం బిర్లా ఇటీవల అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్‌పతిలో పాల్గొన్నారు. ఇక్కడ ఆయన భారతదేశ ఆర్థిక పెరుగుదల గురించి, తన వ్యక్తిగత ప్రయాణం గురించి కూడా వెల్లడించారు.
కుమార్ మంగళం బిర్లా.. భారతదేశం నేడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేర్కొన్నారు. నా కెరీర్ ప్రారంభంలో.. భారతదేశం ఒక రోజు ఆర్థికంగా జపాన్‌ను అధిగమిస్తుందని ఊహించలేదు. అయితే ఈ వేగవంతమైన మార్పు నన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది. యువతకు.. భారతదేశంలో ఉండటానికి ఇంతకంటే మంచి సమయం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారతదేశం గురించి మాత్రమే కాకుండా.. తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. తాను విదేశాల్లో ఎంబీఏ చదవాలని అనుకున్నట్లు, అయితే.. తన తండ్రి మాత్రం ముందు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అర్హత సాధించాలని కఠినంగా ఆదేశించారు. సీఏ చేయకపోతే కుటుంబ వ్యాపారంలో స్థానం లేదని తండ్రి స్పష్టంగా చెప్పడంతో బిర్లా భావోద్వేగానికి లోనైనట్లు చెప్పారు.
తండ్రి సీఏ చేయమని చెప్పినప్పుడు.. నేను నా తాత దగ్గరకు వెళ్లాను. కానీ తాత జోక్యం చేసుకోవడానికి నిరాకరించి, స్వయంకృషితో ఈ సవాలును ఎదుర్కోవాలని సూచించారు. తల్లిని అడిగినప్పుడు.. ''కన్నీళ్లతో అయినా నవ్వుతో అయినా సీఏ పూర్తి చేయాల్సిందే'' అని చెప్పినట్లు, ఆ మాటలు నా మనసులో బలంగా నిలిచిపోయినట్లు కుమార్ మంగళం బిర్లా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సిలికాన్ వ్యాలీని వీడనున్న ఇద్దరు బిలియనీర్లు!
ఆ అనుభవం ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నానని కుమార్ మంగళం బిర్లా తెలిపారు. జీవితంలో గానీ, వృత్తిలో గానీ నమ్మకం & గౌరవం అనేవి శ్రమతోనే సంపాదించాల్సి ఉంటుందని, దానికి ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి.


