చైనా, భారత్‌ నడిపిస్తాయ్‌ | Key Points from Kumar Mangalam Birla Latest Reflections on india growth | Sakshi
Sakshi News home page

చైనా, భారత్‌ నడిపిస్తాయ్‌

Jan 31 2026 9:16 AM | Updated on Jan 31 2026 9:16 AM

Key Points from Kumar Mangalam Birla Latest Reflections on india growth

ప్రపంచ సరఫరా చైన్‌లో కీలక పాత్ర

కుమార మంగళం బిర్లా 

రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్‌ కీలకంగా మారుతుందని ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు.  ఆర్థికంగా భారత్‌ స్థానం మరింత బలోపేతం కావడం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ తీరుతెన్నులను మార్చివేయనుందని చెప్పారు. ఈ దశాబ్దం చివరికి అంతర్జాతీయ తయారీ అన్నది ఏ ఒక్క దేశం చుట్టూ కేంద్రీకృతం కాదంటూ.. భారత్, చైనా కీలకంగా వ్యవహరిస్తాయన్నారు. ఐసీఏఐ వరల్డ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ అకౌంటెంట్స్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.

ప్రపంచ సరఫరా వ్యవస్థలు అస్థిరంగా ఉన్నాయంటూ.. టారిఫ్‌లు పెంచడం కారణంగా 400 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంలో మార్పులు చోటుచేసుకున్నాయన్న ప్రపంచ ఆర్థిక వేదిక డేటాను ప్రస్తావించారు. తయారీపై పెట్టుబడులు అన్నవి ఇప్పుడు షాక్‌లను తట్టుకోగల, రిస్క్‌లను సమర్థంగా నిర్వహించగల, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థల్లోకే వెళుతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో భారత్‌ సుముచిత స్థానంలో ఉన్నట్టు బిర్లా చెప్పారు. దేశీ మార్కెట్‌ విస్తరణకుతోడు పారిశ్రామిక బేస్, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం దీర్ఘకాల పెట్టుబడులకు నమ్మకాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కార్మిక శక్తి తగ్గే సమయానికి.. అదనపు శ్రామిక శక్తిలో భారత్‌ పావు వంతు వాటా కలిగి 
ఉంటుందన్నారు.

భారత్‌లో 3 టెలికం సంస్థలు ఉండాల్సిందే..

సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)కు సంబంధించి ఇటీవల వెలువడిన పరిష్కారం వొడాఫోన్‌ ఐడియాకి నిర్ణయాత్మక ములుపు వంటిదని కుమారమంగళం బిర్లా అన్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు, ప్రభుత్వ జోక్యంతో దీర్ఘకాలంపాటు నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందన్నారు. మనుగడ కోసం కాకుండా ఇకపై స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టేందుకు అవకాశం కల్పించిందన్నారు. వొడాఫోన్‌ ఐడియాకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ సైతం ఒక ప్రమోటర్‌ కావడం తెలిసిందే. భారత మార్కెట్‌కు మూడు టెలికం సంస్థలు ఉండడం సముచితమేనని కుమారమంగళం బిర్లా అన్నారు. అస్థిరమైన ప్రపంచంలో భారత వృద్ధి స్థిరమైన అంశంగా మారినట్టు చెప్పారు. భారత దేశ వృద్ధిలో తమ గ్రూప్‌ చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు.

‘‘భారత్‌ వృద్ధితోపాటే ఆదిత్య బిర్లా గ్రూప్‌ కూడా ఎదుగుతుంది. ఎన్నో రంగాల్లో భౌతిక, డిజిటల్‌ సంస్థాగత సామర్థ్యాన్ని నిర్మిస్తున్నాం. తద్వారా దేశంతో పాటుగా ఎదుగుతాం. దేశ పురోగతి నుంచి ప్రయోజనం పొందుతూనే, సుస్థిరతకు కూడా తోడ్పడతాం’’అని కుమారమంగళం బిర్లా పేర్కొన్నారు. ‘కష్టకాలాలు ఎప్పటికీ ఉండవు. కానీ, దృఢమైన కంపెనీలు శాశ్వతం’ అన్న తన నమ్మకాన్ని వొడాఫోన్‌ ఐడియా అనుభవం గుర్తు చేస్తున్నట్టు చెప్పారు. తమ జాయింట్‌ వెంచర్‌ వొడాఫోన్‌ ఐడియా టెలికం రంగ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొని నిలబడినట్టు పేర్కొన్నారు.  

ఎన్నో అనుకూలతలు..

మూడు దశాబ్దాలుగా ప్రపంచ తయారీ కేవలం ఒక భౌగోళిక ప్రదేశం (చైనా)పైనే ఆధారపడి ఉండడాన్ని కుమార మంగళం బిర్లా ప్రస్తావించారు. ఆ నమూనా అసాధారణ ఫలితాలనిచ్చిదంటూ.. ఇకపై ఇదే విధానం కొనసాగబోదన్నారు. చైనా ప్లస్‌ వన్‌ నమూనా మరింత బలపడుతుందన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధితో లాజిస్టిక్స్‌ (రవాణా) వ్యయాలు తగ్గుతాయన్నారు. పట్టణాభివృద్ధితోపాటు తలసరి ఆదాయం 10,000 డాలర్లకు పెరగడం.. ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ను బలమైన శక్తిగా ఇతర దేశాలు చూస్తాయన్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement