కేంద్ర బడ్జెట్ 2026-27: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం.. | Budget 2026–27, Nirmala Sitharaman’s 9th Budget Key Speech Might Break Her Own Record Amid High Expectations | Sakshi
Sakshi News home page

Budget 2026-27: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Jan 31 2026 8:14 AM | Updated on Jan 31 2026 8:51 AM

Nirmala Sitharaman ninth Budget speech might break her own record

దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో విడత పాలన, అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్‌ టారిప్‌లు, వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఇది కీలకమైన బడ్జెట్ కావడంతో సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి కళ్లు ఆర్థిక మంత్రి ప్రసంగంపైనే ఉన్నాయి.

ఆశలు.. ఆకాంక్షలు

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు చిరువ్యాపారులు, ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి తన తొమ్మిదో బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘ సమయంపాటు చదివి కొత్త రికార్డును సృష్టిస్తారని కొందరు భావిస్తున్నారు.

రికార్డు ప్రసంగాలు

భారత బడ్జెట్ చరిత్రలో ప్రసంగాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రసంగ సమయంలో కొందరు మంత్రులు కవితలతో ఆకట్టుకుంటే మరికొందరు గంటల తరబడి గణాంకాలతో వివరిస్తారు.

బడ్జెట్ ప్రసంగం నిడివి పరంగా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. 2020 బడ్జెట్‌ సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. 2019లో ఆమె నెలకొల్పిన 2 గంటల 19 నిమిషాల రికార్డును ఆమె మళ్లీ తిరగరాశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ (2003లో 2 గంటల 13 నిమిషాలు), అరుణ్ జైట్లీ (2014లో 2 గంటల 10 నిమిషాలు) సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.

పదాల పరంగా మన్మోహన్ సింగ్ రికార్డు

ప్రసంగంలోని పదాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన 1991 బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. లైసెన్స్ రాజ్‌ చట్టానికి స్వస్తి పలికి ఆర్థిక సరళీకరణకు బాటలు వేసిన ప్రసంగం ఇది.

సంక్షిప్త ప్రసంగం

1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం. పటేల్ కేవలం 800 పదాలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇది భారత చరిత్రలోనే అతి తక్కువ నిడివి గల ప్రసంగం. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి తన శైలికి భిన్నంగా వ్యవహరించారు.

ఈసారి ఏం జరగబోతోంది?

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరంగా ఉంచుతూనే సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రసంగంతో అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.

ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement