సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ టీవీ షోల ద్వారా వారికి మరింత దగ్గరయ్యాడు. కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) అనే రియాలిటీ షోకి అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ కేబీసీ 17వ సీజన్ శుక్రవారం ముగిసిపోయింది. ఈ క్రమంలో చివరి ఎపిసోడ్ ప్రారంభంలో బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యాడు.
అంతా నిన్ననే..
కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. అదేంటి, ఇప్పుడే కదా మొదలైంది అన్నంత బాధేస్తుంది. ప్రతీది నిన్ననే జరిగినట్లుగా ఉంటుంది. ఈరోజు చివరి ఎపిసోడ్.. నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు, అంతకన్నా ఎక్కువ ఈ షో ద్వారా మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశం.
థాంక్యూ సో మచ్
నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు.. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీ కళ్లు చెమ్మగిల్లాయి. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి ఆఖరు వరకు మీరంతా నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలాగే కొనసాగుతుంది. థాంక్యూ సో మచ్ అని పేర్కొన్నాడు. ఆయన కామెంట్స్ విని అభిమానులు సైతం ఎమోషనలవుతున్నారు. మీరు షోలో ఉన్నారు కాబట్టే మేమింకా దాన్ని చూస్తున్నాం.. కేబీసీ 18వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.


