తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వెంకటేశ్వరరావు (ఘంటసాల) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’ . సి.హెచ్. రామారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించారు. ఈ మూవీ జనవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కృష్ణా జిల్లాలోని చౌటపల్లికి చెందిన ఘంటసాల(అతులిత్/కృష్ణ చైతన్య) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. ఎప్పకైనా గొప్ప సంగీత విద్వాసుడు అవుతానంటూ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు విజయనగరం వెళ్తాడు. అక్కడ ఓ సంగీత పాఠశాలలో చేరాలనుకుంటాడు.కానీ అతని ప్రయత్నం ఫలించదు. చివరకు పట్రాయని సీతారామశాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరతాడు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే..పొట్టకూటి కోసం రోడ్డు మీద భిక్షాటన చేస్తాడు. తన శిక్షణ పూర్తయ్యాక తిరిగి సొంతూరుకు వెళ్తాడు.
తనకు వరసైన పార్వతమ్మ (మృదుల)ని పెళ్లి చేసుకుంటాడు. ఆపై సముద్రాల రాఘవాచారి (జె.కె. భారవి) ప్రోద్బలంతో మద్రాసుకి వెళ్తాడు. ఇక మద్రాసుకి వెళ్లిన తరువాత ఘంటసాలకు ఎదురైన అనుభవాలు ఏంటి? రోడ్డు మీద భిక్షాటన చేసే స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వేదికలపై కచేరీలో చేసే స్థాయికి ఎలా ఎదిగాడు? చివరి దశలో ఆయనకు వచ్చిన కష్టాలేంటి? ఆయన చివరి కోరిక ఏంటి? అది నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఘంటసాల గొప్ప గాన గంధర్వుడు అని అందరికి తెలిసిందే. ఎన్నో వేల పాటల్ని పాడి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన..జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. నేటి తరానికి పెద్దగా తెలియని ఘంటసాల వ్యక్తిగత జీవితాన్ని తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల వ్యక్తిగత కష్టాలు, గొప్ప మనసును ప్రేక్షకులకు తెలియజేయడం లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఫస్టాఫ్ మొత్తం ఘంటాల బాల్యం, ఆర్థిక ఇబ్బందులు, సంగీతం నేర్చుకునే క్రమంలో ఎదురైన అవమానాలను చూపించారు. ఘంటసాలను వేధించే పీడకల ప్రవేశంతో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్‌ను డిజైన్ చేశారు. ఇక సెకండాఫ్లో ఘంటసాల వైభవం, ప్రఖ్యాతిని చూపించారు. ఆయన ఇండస్ట్రీలోకి రావడం.. తన సంగీతంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం.. ఘంటసాల సూపర్ హిట్ పాటలతో కాస్త ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ వంటి దిగ్గజాల ప్రశంసల సీన్లు ఆకర్షణీయంగా ఉంటాయి. బడే గులాం అలీ ఖాన్‌తో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చక్కగా వివరించారు. ఘంటసాల పర్సనల్ లైఫ్‌ని నేటి తరానికి తెలియజేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు కానీ.. ఓ పూర్తి స్థాయి సినిమాగా, కమర్షియల్‌గా చూసుకుంటే మాత్రం ఘంటసాల అందరినీ అంతగా మెప్పించకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే..
చిన్నప్పటి ఘంటసాల పాత్రలో బాల నటుడు అతులిత్ బాగా నటించాడు. ఇక పెద్ద ఘంటసాల పాత్రలో కృష్ణ చైతన్య జీవించేశాడు. ఆయన నడక, హావభావాలు అన్ని తెరపై నిజమైన ఘంటసాను చూసినట్లుగానే అనిపిస్తాయి. ఘంటసాల సతీమణి పార్వతమ్మగా మృదుల చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. ఓ కీలక పాత్రలో బడే గులాం అలీ ఖాన్‌గా సుమన్ తన పరిధి మేరకు నటించి మెప్పించారు. ఘంటసాల వారి గురువు పట్రాయని సితారామ శాస్త్రిగా సుబ్బరాయ శర్మ, సముద్రాల రాఘవాచారిగా జె.కె. భారవి, ఇంద్రుడి పాత్రలో సాయి కిరణ్, ఘంటసాల తల్లిగా జయ వాణి తో మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం.
చాలా వరకు ఘంటసాల వారు పాడిన పాటల్నే వాడారు. ఇక ఘంటసాల థీమ్ మ్యూజిక్, బడే గులాం అలీ ఖాన్ పాడిన పాటలు, నేపథ్య సంగీతం అన్నీ కూడా ఆ కాలంలోకి తీసుకెళ్లినట్టుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ మాత్రం తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆర్ట్ వర్క్ కూడా చాలా వరకు ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
రేటింగ్: 2.5/5


