తమిళ నటుడు విజయ్ సేతుపతి దక్షిణాదితో పాటు హిందీలోనూ సినిమా చేస్తున్నాడు. గతేడాది ఏస్, తలైవన్ తలైవి లాంటి తమిళ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పుడు సడన్‌గా ఓ మూకీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు టీజర్ రిలీజ్ చేశారు.
'గాంధీ టాక్స్' పేరుతో తీస్తున్న సినిమాలో తాను నటిస్తున్నానని విజయ్ సేతుపతి.. అప్పుడెప్పుడో 2021లో పోస్ట్ పెట్టాడు. తర్వాత ఈ మూవీ పత్తా లేకుండా పోయింది. 2023 నవంబరులో గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిత్రాన్ని ప్రదర్శించారు. తర్వాత మళ్లీ సైలెంట్. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. టీజరో ట్రైలరో తెలీదు గానీ 80 సెకన్ల వీడియోని రిలీజ్ చేసి థియేటర్లలోకి ఎప్పుడొస్తుందనే విషయాన్ని ప్రకటించారు. మూకీ సినిమాని ఈ జనరేషన్ ప్రేక్షకులు ఎంతమేరకు ఆదరిస్తారనేది చూడాలి?


